Last Updated:

RR VS SRH: రాజస్థాన్ కొంపముంచిన నో బాల్.. సన్ రైజర్స్ అద్భుత విజయం

RR VS SRH: చివరి బంతికి సన్ రైజర్స్ కి 5పరుగులు కావాలి. సిక్స్‌ కొడితే విజయం. ఫోర్‌ కొడితే టై. సందీప్‌ శర్మ ఆఖరి బంతి వేశాడు. కానీ బంతి నేరుగా వెళ్లి బట్లర్‌ చేతికి చిక్కింది.

RR VS SRH: రాజస్థాన్ కొంపముంచిన నో బాల్.. సన్ రైజర్స్ అద్భుత విజయం

RR VS SRH: రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి అబ్దుల్ సమద్ హైదరాబాద్ కు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ ని గ్లెన్ ఫిలిప్స్ మలుపు తిప్పాడు. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన సమయంలో సందీప్ శర్మ నో బాల్ వేసి.. సన్ రైజర్స్ కు మరో అవకాశం ఇచ్చాడు.

ఉత్కంఠ పోరు..(RR VS SRH)

చివరి బంతికి సన్ రైజర్స్ కి 5పరుగులు కావాలి. సిక్స్‌ కొడితే విజయం. ఫోర్‌ కొడితే టై. సందీప్‌ శర్మ ఆఖరి బంతి వేశాడు. కానీ బంతి నేరుగా వెళ్లి బట్లర్‌ చేతికి చిక్కింది.

అంతే.. సన్ రైజర్స్ అభిమానులు నిరాశలో.. సంబరాల్లో రాజస్థాన్‌ అభిమానులు ఉన్నారు. కానీ ఇది జరిగింది కొన్ని క్షణాలే.

సందీప్ శర్మ నో బాల్ వేశాడని ఎంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక్కసారిగా స్టేడియం సైలెంట్ అయింది. ఈసారి సందీప్‌ బంతి వేశాడు.

సమద్‌ దాన్ని స్ట్రెయిట్‌ సిక్సర్‌గా మలిచి హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

భారీ లక్ష్య ఛేదన..

రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించింది.

కీలక సమయంలో.. గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. దీంతో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

మెుదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది.

జోస్‌ బట్లర్‌ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, సంజు సామ్సన్‌ (38 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లోనే 138 పరుగులు జోడించడం విశేషం. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు సాధించింది.

తడబడిన సన్ రైజర్స్..

215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ మెుదట తడబడింది. 17 ఓవర్లకు సన్ రైజర్స్ 171 పరుగులు చేసింది. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి.

అయితే 18వ ఓవర్లో కీలక బ్యాటర్లు రాహుల్‌ త్రిపాఠి, మార్క్‌రమ్‌లను చహల్‌ అవుట్‌ చేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ పైచేయి సాధించింది.

కానీ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచి గ్లెన్‌ ఫిలిప్స్‌ మ్యాచ్‌ను మళ్లీ రైజర్స్‌ చేతుల్లోకి తెచ్చాడు.

ఐదో బంతికి అతను అవుట్‌ కాగా, ఆఖరి ఓవర్లో సమీకరణం 17 పరుగులుగా మారింది.

సందీప్‌ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి 5 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అబ్దుల్‌ సమద్‌ను అవుట్‌ చేసి సందీప్‌ శర్మ సంబరాలు చేసుకున్నాడు.

అయితే అది నోబాల్‌గా తేలింది. సన్‌రైజర్స్‌ విజయానికి ఫోర్‌ అవసరం కాగా, సందీప్‌ మళ్లీ వేసిన ఆఖరి బంతిని సమద్‌ సిక్సర్‌గా మలిచాడు.

దాంతో సన్‌రైజర్స్‌ శిబిరం సంబరాల్లో మునిగిపోగా, జైపూర్‌ స్టేడియం మూగబోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది.