Rules Ranjan Movie Review : టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డిజే టిల్లు ఫేమ్ “నేహాశెట్టి”తో కలిసి నటించిన చిత్రం “రూల్స్ రంజన్”. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ క్రమం లోనే కిరణ్ మరోసారి హిట్ కొట్టాడా ?? లేదా అనేందుకు మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం..
మూవీ కథ..
తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) చదువులో యావరేజ్ అయినా కష్టపడి క్యాంపస్ సెలక్షన్‌లో ముంబైలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే అతనికి హిందీ రాకపోవడం వల్ల ఆరంభంలో ఆఫీస్‌లో కొన్ని అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యకు అలెక్సాతో చెక్ పెడతాడు. తన ప్రతిభతో బాస్‌ను మెప్పించి.. టీమ్ లీడర్‌గా ఎదుగుతాడు. అక్కడి నుంచి ఆఫీస్‌లోని ఉద్యోగులంతా తన రూల్స్ ప్రకారం నడిచేలా కట్టుదిట్టం చేస్తాడు. దీంతో వాళ్లంతా అతన్ని రూల్స్ రంజన్ అని పిలవడం మొదలు పెడతారు. అయితే ఒంటరిగా సాగిపోతున్న రంజన్ జీవితం సనా (నేహాశెట్టి) రాకతో మరో మలుపు తిరుగుతుంది. ఆమెను కాలేజీ రోజుల్లోనే రంజన్ గాఢంగా ప్రేమిస్తాడు. కానీ, భయంతో ఆ ప్రేమను ఏనాడూ బయట పెట్టడు. చాలా ఏళ్ల తర్వాత ముంబయిలో సనాని కలుసుకున్నాక రంజన్ తన మనసులోని ఇష్టాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇద్దరూ కలిసి ఒకరోజంతా సరదాగా గడుపుతారు. ఈ క్రమంలో ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆమె దూరమవడంతో తనని వెతుక్కుంటూ తిరుపతికి వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది వెండి తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ (Rules Ranjan Movie Review)..
టైటిల్ కార్డ్స్ నుంచే రంజన్ తన కథను.. నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తన ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తనకు హిందీ రాకున్నా.. వచ్చని చెప్పి ఉద్యోగం సంపాదించడం.. దాని కోసం ముంబయి వెళ్లడం.. అక్కడ ఆఫీసులో హిందీ రాక అవమానాలు పాలవ్వడం.. ఇలా డల్‌గా కథ సాగిపోతుంటుంది. కామేశ్‌గా వెన్నెల కిషోర్ తెరపైకి వచ్చినప్పటి నుంచి అటు కథలోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ జోష్ వస్తుంది. కిరణ్ – వెన్నెల కిషోర్ మధ్య సీన్స్ బాగున్నాయి. కాలేజీ రోజుల్లోని రంజన్ ప్రేమకథను ఓ పాటతో సింపుల్‌గా కానిచ్చేశారు. విరామానికి ముందు నేహా పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఓ ఇంటర్వ్యూ కోసం ముంబయి వచ్చిన ఆమెను రంజన్ చూడటం.. ఆమెకు సాయం చేసే క్రమంలో ఓ రోజంతా తనతో తిరిగే అవకాశం రావడం.. ఈ ప్రయాణంలో సనా అతనికి దగ్గరవడం.. ఇలా కథ కాస్త రొమాంటిక్ యాంగిల్‌లోకి టర్న్ తీసుకుంటుంది. సనాని వెతుక్కుంటూ రంజన్ తిరుపతికి రావడం.. వీరిద్దర్నీ ఎలాగైనా విడగొట్టాలని హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ వేసే ఎత్తుగడలతో కథ కాస్త నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్ లో లాజిక్ లేక పోయినా వెన్నెల కిషోర్ కామెడీ తో మెప్పించాడు.
ఎవరెలా చేశారంటే..
మనో రంజన్ పాత్రలో కిరణ్ అబ్బవరం చక్కగా ఒదిగిపోయారు. మంచి కామెడీ టైమింగ్ ప్రదర్శించాడు. సనాగా నేహా అందంగా కనిపించింది. ‘‘సమ్మోహనుడా’’ పాటలో ఆమె పలికించిన హావభావాలు.. వేసిన స్టెప్పులు.. ఆ పాటను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటాయి. ప్లేబాయ్‌లా వ్యవహరించే కామేశ్ పాత్రలో వెన్నెల కిషోర్ వినోదం సినిమాకి బలాన్నిచ్చింది. దర్శకుడు ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ముఖ్యంగా లవ్ ట్రాక్ మరీ పేలవంగా ఉంది. అనవసరమైన సన్నివేేశాలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. అమ్రిష్ సంగీతం ఫర్వాలేదనిపించింది. సమ్మోహనుడా పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆమ్రీష్ అందించిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఆకట్టుకుంటుంది. దీని పిక్చరైజేషన్ కూడా బాగా తీశారు. మిగతా పాటలన్నీ సోసోగానే ఉంటాయి. నిర్మాతల ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి.
కంక్లూజన్..
సమ్మోహనుడా.. ఒకసారి ఓకే