MLAs Complaint against AU Ex VC Prasad Reddy to Nara Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ హయాంలో ఏయూ వీసీగా పని చేశారు. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల చిట్టాను ఒక్కోటి బయటకు తీశారు. లిస్టు రెడీ చేసి మంత్రి లోకేశ్ కి అందజేశారు. అక్రమాలపై విచారణ చేపట్టాలని కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు.
వైసీపీ కార్యాలయంగా ఏయూ..
పవిత్రమైన సరస్వతీ నిలయాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలతో భ్రష్టుపట్టించారని కూటమి నాయకులు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థకు రాజకీయ రంగుపులుమారని ఆరోపించారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చారని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ నిధులను మళ్లించారని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. విచారణలో ప్రసాద్ రెడ్డి అవినీతి డొంక కదులుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు.
యూనివర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడం, అధికార పార్టీ నాయకుల కోసం క్యాంప్‌సలో భారీగా చెట్లు నరికివేయించడం లాంటి పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఆయనను తొలగించాలని అనేకసార్లు డిమాండ్ చేశాయి.వర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అన్యాయం చేశారని, అక్కడి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ అర్థంతరంగా తొలగించి రూ. 18లక్షల ఆర్థిక నష్టం, రూ. 50 లక్షల సామాగ్రి దెబ్బ తీశారనే ఆరోపణలూ ఉన్నాయి.