Priyanka Gandhi Win in Wayanad By-Election: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబం కొత్త ఆప్షన్లు వెతుకున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లకు ఆవల మరో సేఫ్ సీటు కోసం వెతికారు. అప్పట్లో రాయ్ బరేలీ స్థానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వాయనాడ్ లో పోటీ చేశారు. అమేథీలో ఓడిన రాహుల్.. వాయనాడ్ లో భారీ మెజార్టీతో గెలుపొందారు.
రెండు చోట్ల భారీ విజయాలు
ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన తల్లి సోనియా అనారోగ్య కారణాలతో మరో కంచుకోట రాయ్ బరేలీ సీటు నుంచి తిరిగి పోటీకి ఆసక్తి చూపారు. దీంతోపాటు మరోసారి వాయనాడ్ లో పోటీ చేశారు. రెండు చోట్ల భారీ విజయాలు నమోదు చేసుకున్నారు. తర్వాత వాయనాడ్ సీటును వదిలి రాయ్ బరేలీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో వాయనాడ్ లో ఎవరు పోటీ చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. అప్పట్లో అమేథీలో పోటీ చేయని ప్రియాంక.. ఇప్పుడు తాను వదులుకున్న వాయనాడ్ లో పోటీ చేయించారు.
రికార్డు స్థాయిలో విజయం సొంతం..
తాజాగా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలో తన సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08.036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.
రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్..
వయనాడ్ ఉప ఎన్నికల్లో సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ కు 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా, ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ మూడో స్థానంలో ఉన్నారు.