Subramanian Swamy: ప్రభుత్వ నివాసాన్ని సుబ్రమణ్య స్వామి ఖాళీ చేయాల్సిందే..
ఢిల్లీకి వెల్లతారు. అక్కడే నివాసం ఉండాలంటారు. అది కూడా అప్పనంగా ప్రభుత్వం నివాసమే కావాలంటారు. ఇది నేటి ప్రజా ప్రతినిధుల తీరు. అలాంటి వారికి ఢిల్లీ కోర్టు ఒప్పుకొనేది లేదంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
Delhi: తన మాటలతో పాలక నేతలను ఇరుకున పెట్టే వాగ్దాటి, ప్రముఖ న్యాయవాది, భాజపా నేత సుబ్రమణ్య స్వామికి ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ఆయన నివసిస్తున్న ప్రభుత్వ భవనాన్ని 6వారాల్లో ఖాళీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. వివరాల్లోకి వెళ్లితే, 2016లో భద్రత కారణాలతో ఆయనకు ప్రభుత్వం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసింది. ఆయనకు భద్రతను కూడా కల్పించింది. ఐదేళ్ల కాల పరిమితి ముగియడంతో మరికొంత కాలం తనకు గడువు ఇవ్వాలని స్వామి కోరారు. కేంద్రం ఒప్పుకోలేదు.
దీనిపై హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ కోర్టులో తన న్యాయవాదితో వాదనలు వినిపించింది. సుబ్రమణ్య స్వామి పదవీ కాలం ఏప్రిల్ లో ముగిసిందని, నివాసం కల్పించలేమని, నిజాముద్దీన్ ఈస్ట్ లోని స్వామి నివాసంలో భద్రత మాత్రం ఇవ్వగలమని కోర్టుకు తెలిపింది. కేసు హైకోర్టులో ఉందని, స్వామిపై చర్యలు తీసుకోలేమని, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులకు వసతి చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు ఆరు వారాల్లోగా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశించింది.