YS Avinash: వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా..

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది.

YS Avinash: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది. ఆయనను మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు సీబీఐ అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ వాట్సాప్ లో అవినాష్ కు సీఆర్పీపీసీ 160 కింద నోటీసులు పంపించారు.

 

విచారణ మంగళవారానికి వాయిదా

కాగా, వివేకా హత్య కేసులో భాగంగా అవినాష్ రెడ్డికి ఆదివారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం(ఏప్రిల్ 17) మధ్యాహ్నం 3 గంటలకు హైదారాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు అవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే, విచారణ వాయిదా పడినట్టు సమాచారం రావడంతో ఆయన సీబీఐ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా సీబీఐ చేర్చింది.

 

ముందస్తు బెయిల్ పిటిషన్

కాగా, తెలంగాణ హైకోర్టులో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ అనుమతించింది. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు బెంచ్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం  ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.