Fire Accident : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ పలుచోట్ల మాత్రం విషాద ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో దీపావళి సంబరాల్లో భాగంగా తారాజువ్వలు పేలుస్తుండగా ఊహించని రీతిలో ఓ పూరింటిపై తారాజువ్వ పడింది. దీంతో అగ్ని ప్రమాదం సంభవించి.. ఓ మహిళ సజీవ దహనం అవ్వడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఓ పూరి గుడిసెలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటికి సమీపంలోనే దీపావళి సంబరాల్లో భాగంగా తారాజువ్వలు పేలుస్తుండగా ఊహించని రీతిలో ఆ తారాజువ్వ వీరు నివసిస్తున్న గుడిసెపై పడడంతో అగ్ని ప్రమాదం వ్యాపించింది. ఈ ప్రమాదంలో పెద్దపూడి మంగాదేవి అనే మహిళ సజీవ దహనం అవ్వగా.. ఆమె భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండగా.. వీరి ఇద్దరు కొడుకులు గాయాలపాలయ్యారు. గాయపడిన ముగ్గురిని కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఇంట్లో పెట్రోలు నిల్వ చేసి పెట్టుకున్నారు. దీనివల్లే తారాజువ్వ పడగానే చెలరేగిన మంటలు పెద్దగా వ్యాపించడంతో.. ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 108 సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించి వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.