GST Revenue: ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. మార్చి నెలకు సంబంధించి రూ. 1.60 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022, మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఈసారి 13 శాతం పెరిగాయి. మరో వైపు జీఎస్టీని అమలులోకి తెచ్చినప్పటి నుంచి వస్తు సేవల పన్ను వసూళ్లు రెండో సారి రూ. 1.60 లక్షల కోట్లు క్రాస్ అయ్యాయి.
మార్చి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1,60,122 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ తెలిపింది. అందులో సీజీఎస్టీ కింద రూ. 29,546 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ. 37,314 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 82, 907 కోట్లు వచ్చినట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఇక సెస్సుల రూపంలో రూ. 10,355 కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కూడా) వసూలైనట్లు పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సెస్ వసూళ్లలో ఇది రెండవసారి అత్యధిక మొత్తమని వెల్లడించింది. అదేవిధంగా వరుసగా 12 నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్ల పైనే రావడం విశేషం. ఏప్రిల్, 2022 లో అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయి ఇప్పటి వరకు ఆల్ టైం రికార్డుగా ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా రూ.18.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. అంటే నెలకు దాదాపుగా రూ.1. 51 లక్షల కోట్లు అన్నమాట. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఈ వసూళ్లు 22 శాతం పెరిగాయని ఆర్థికశాఖ వెల్లడించింది.