Pawan Kalyan: జనసేన పార్టీ సంచలన నిర్ణయం.. కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనకు శ్రీకారం
Deputy CM Pawan Kalyan district tour plan in new year: జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవటంతో బాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకే జిల్లాల పర్యటనలకు జనసేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా, నేరుగా కార్యకర్తలు, నేతలతో పవన్ మాట్లాడనున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
4 జిల్లాల్లో పాజిటివ్ మెసేజ్
ఇప్పటికే ఉత్తరాంధ్ర, కృష్ణా, కడప జిల్లాలలో పవన్ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలతో పవన్ మమేకమవుతూ, అక్కడి సమస్యను పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి, దానిని సమర్థంగా అమలయ్యేలా చేయగలిగారు. మన్యంలో రోడ్లు, కడప జిల్లాలో ఎంపీపీ మీద దాడి ఘటన, కృష్ణా జిల్లాలో రోడ్ల మరమ్మతులు, తాగునీటి సమస్యల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో మంచి మార్పును తీసుకురావటంతో క్రమంగా జనసేనాని పట్ల ప్రజలలో సానుకూలత వ్యక్తమవుతోంది. ఇదే రీతిలో అన్ని జిల్లాలలోనూ పర్యటించటం ద్వారా జనబలాన్ని కూడగట్టుకోవాలని పార్టీ కీలక నేతలు నిర్ణయించటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెడీ అవుతున్న రూట్ మ్యాప్..
నెలకో జిల్లా చొప్పున పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో బాగా వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, అక్కడే బస చేసి, వారి యోగక్షేమాలు కనుక్కుని, అక్కడి అధికారులతో వారి సమస్యలపై పవన్ చర్చిస్తారు. దీనికోసం జిల్లాల వారీగా వెనకబడిన ప్రాంతాలు, అక్కడ దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు, విద్య, ఉపాధి వంటి అంశాలలో అక్కడి విద్యార్థులు, యువత.. ఇలా అంశాల వారీగా నెలకొన్న సమస్యలను పార్టీ కార్యాలయంలోని ఒక విభాగం ఆరా తీస్తోంది. ప్రాధాన్యతలను బట్టి పవన్ పర్యటనలో ఆయా జిల్లాల పర్యటన ఉండబోతోంది.
వారి సూచన మేరకేనా?
కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి అయిన సందర్భంగా ప్రజల మూడ్ తెలుసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే రాబిన్ శర్మ బృందాన్ని రంగంలోకి దించారు. మరోవైపు, వైసీపీ అధినేత జగన్ సైతం జనవరి నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, జనసేనానిని అలెర్ట్ చేశారనే వాదనా వినిపిస్తోంది. ప్రజలలో పవన్‌కు ఉన్న పట్టును, జనాకర్షణను.. సేవ, అభివృద్ధి రూపాలలో చేసి చూపటం ద్వారా ప్రజలలో బలపడటం సులభమని జనసేన, బీజేపీలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చిందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అసలు టార్గెట్ వైసీపీయేనా?
వైసీపీ చీఫ్ జగన్ సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్న వేళ.. ఆయా జిల్లాలలోనే పవన్ కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వస్తే పాత పద్ధతులు మార్చుతామని, అభివృద్ధి చేసి చూపుతామని గతంలో హామీ ఇచ్చిన పవన్.. ఆ మేరకు చేస్తున్న పనులను జనంలోకి తీసుకుపోవటం ద్వారా అటు జగన్‌కు చెక్ పెట్టటంతో బాటు తాను తెచ్చిన మార్పును నేరుగా జనానికి చెప్పుకోవచ్చనే ఆలోచన కూడా ఈ ప్రకటన వెనక ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ ఆదేశం.. అధికారుల పరుగులు
కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతిపై ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై ఒక సమగ్ర నివేదికను తయారు చేసి తనకు పంపాలంటూ ఆయన కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో కాకినాడ వాకలపూడి పారిశ్రామికవాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూలంగా తలెత్తుతున్న వాయు, జల కాలుష్యంపై విచారణకు ఆదేశించారు. ఈ పరిశ్రమ నుంచి తీవ్ర దుర్గంధంతో కూడిన ఘాటైన వాయువులు విడుదలై తాము అనారోగ్యం పాలవుతున్నామంటూ అక్కడి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పవన్ తక్షణం స్పందించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) చైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడి సదరు సంస్థ నిబంధలను పాటిస్తుందో లేదో వెంటనే తనిఖీ చేయాలని ఆదేశించారు. దీంతో సదరు అధికారులు హుటాహుటిన సంబంధిత పరిశ్రమలో తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత ఘాటైన ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించి, దీనిపై ఒక నివేదికను రెడీ చేసే పనిలో పడ్డారు.