Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది.
కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని మైకోర్టు స్పష్టం చేసింది.
ప్రకాశం, అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టింగ్స్, సినిమా పోస్టర్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్, వర్మ తరపున న్యాయవాదికి మధ్య వాడీవేడిగా వాదోపవాదాలు సాగాయి.
ఓ స్టార్ డైరెక్టర్‌గా, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. సినిమాల నుంచి సమాజం చాలా నేర్చుకుంటుందని ఆయన చెప్పారు. ఇక, హైదరాబాద్‌లోనే ఉన్నానని.. వర్మ వీడియోలు పెడుతున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే, ఒకే పోస్టర్‌పై 12 కేసులు నమోదు చేశారని వర్మ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. చివరికి వర్మకు ముందస్తు బెయిల్ లభించింది.