Shubhanshu Shukla Space Tour: యాక్సియం-4 మిషన్ వాయిదా
NASA Postponed Axiom-4 Mission Experiment: శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈనెల 22న యాక్సియం-4 మిషన్ ను చేపడతామని రెండు రోజల క్రితమే నాసా ప్రకటించింది. తాజాగా మరోసారి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మిషన్ ను ఎప్పుడు చేపట్టేది త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది. నాసాతో కలిసి ఇస్రో చేపడుతున్న ఈ ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మే 29న జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మిషన్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో భారత్ కు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షానికి వెళ్తాడని ఆశించిన భారతీయులకు నిరాశ ఎదురైంది.
కాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ స్టేషన్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. నాసా చేపట్టనున్న ఈ ప్రయోగంలో భారత్, పోలాండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లనున్నారు. ఈ మిషన్ లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరించనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం చేపడుతున్న ఏఎక్స్-4 మిషన్ లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్ కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టారు.