Last Updated:

Bangladesh: బంగ్లాదేశ్ లో రికార్డుస్దాయి ఉష్ణోగ్రతలు.. మూత పడ్డ పవర్ ప్లాంట్లు, స్కూళ్లు

బంగ్లాదేశ్‌లో దశాబ్దం తర్వాత ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. దీంతో దేశంలో తరచూ కరెంటు కోతలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇంధన కొరతతో విద్యుత్‌ కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో పక్క కరెంటు కోతలతో బంగ్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్ లో రికార్డుస్దాయి ఉష్ణోగ్రతలు.. మూత పడ్డ పవర్ ప్లాంట్లు, స్కూళ్లు

Bangladesh:బంగ్లాదేశ్‌లో దశాబ్దం తర్వాత ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. దీంతో దేశంలో తరచూ కరెంటు కోతలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇంధన కొరతతో విద్యుత్‌ కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో పక్క కరెంటు కోతలతో బంగ్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.కరెంటు కోతలతో బంగ్లదేశ్‌లో బలవంతంగా స్కూళ్లు మూసివేయాల్సి వస్తోంది. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.

స్కూళ్లు, పవర్ ప్లాంట్ల మూత..(Bangladesh)

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని పలు మురికివాడల్లో రాత్రి పూట విద్యుత్‌ ఉండటం లేదు. వేలాది ప్రైమరీ, సెకండరీ స్కూళ్లను బలవంతంగా మూసివేయాల్సి వస్తోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఢాకాలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌పైనే నమోదవుతోంది. దేశంలోని ఇతర నగరాల విషయానికి వస్తే రంగపూర్‌లో ఉష్ణోగ్రత 41 డిగ్రీలపైమాటే. 1958 తర్వాత ఈ స్థాయిలో ఎండలు కాయలేదని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ వారం ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో అతి పెద్ద విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌లో పనులు నిలిపివేశారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇంధనం దిగుమతిని నిలిపివేయడమే. బంగ్లదేశ్‌ వద్ద విదేశీమారకద్ర్యం భారీగా కుంగిపోవడంతో ఇంధనం దిగుమతిని నిలిపివేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు డాలర్‌ మారకంతో బంగ్లాదేశ్‌ కరెన్సీ టాకా 25 శాతం క్షీణించింది. రోజంతా రెండు లేదా మూడు గంటల పాటు విద్యుత్‌ ఇస్తే మహా గొప్ప అని అంటున్నారు ఢాకా నివాసితులు. ఇక అధికారుల వాదన ఏమిటంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని చెబుతున్నారు. చేతిలో డాలర్లు లేకనే ఈ పరిస్థితి అని వారు వివరిస్తున్నారు.

తగ్గిపోయిన విదేశీమారక నిల్వలు..

బంగ్లాదేశ్‌ సెంట్రల్‌ బ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం క్రమంగా కుంగిపోతోంది. ఏడేళ్లలో మొదటిసారి నిల్వలు 30 బిలియన్‌ డాలర్లకు దిగవచ్చాయి. ఏడాది క్రితం 46 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్యం నిల్వలుండేది. దేశంలోని 1320 మెగావాట్ల పెరా పవర్‌ ప్లాంట్‌కు బొగ్గులేకపోవడంతో ప్లాంట్‌ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు మాత్రం ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని హామీలు అయితే గుప్పిస్తున్నారు. దేశంలోని 153 పవర్‌ ప్లాంట్‌లలో 53 పవర్‌ ప్లాంటులు మూతపడ్డాయి. పేరుకు మెయిన్‌టెనెన్స్‌ అని చెబుతున్నా ఇంధనం కోసం డాలర్ల కొరత కారణంగా ప్లాంట్‌లను మూసివేయాల్సి వస్తోంది.దేశానికి విదేశీ మారకద్రవ్యం సంపాదించే పెట్టే రెడీమెడ్‌ దుస్తుల పరిశ్రమ కుప్పకూలింది. ఎగుమతుల్లో 80 శాతం రెడీమేడ్‌ దుస్తులే ఆక్రమిస్తున్నాయి. ఫ్యాక్టరీ యజమానులు మాత్రం తమకు ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని, దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆర్డర్లు ఖచ్చితంగా సమయానికి పంపాల్సి ఉంటుంది.. ఆలస్యం చేస్తే తమకు బిల్లులు రావని వాపోతున్నారు ఫ్యాక్టరీ యజమానులు.

ప్రధానమంత్రి షేక్‌ హసీనా కూడా విద్యుత్‌ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంగీరించారు. విపరీతమైన ఎండ వేడిమి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాని ఆమె అన్నారు. ఆమె సొంత పార్టీ అవామీ లీగ్‌ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ చేరుకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రధానమంత్రి అన్నారు. ఖతర్‌, ఒమాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి ఇంధనం, బొగ్గు దిగుమతి చేసుకుంటామని చెప్పారు. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధంతో యావత్‌ ప్రపంచం ఇంధన కొరతతో సతమతమవుతోందన్నారు షెక్‌ హసీనా.