Sheikh Hasina: షేక్ హసీనాకు ఆరునెలల జైలు శిక్ష

International Crime Tribunal: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానంలో చుక్కెదురైంది. కోర్టు ధిక్కార కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించిందని స్థానిక మీడియా తెలిపింది. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చినట్టు ఢాకా మీడియాలో కథానాలు వచ్చాయి. న్యాయస్థానంలోని చైర్మన్ జస్టిస్ ఎండి గోలం మోర్జుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే గైబంధ జిల్లా గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఢాకాకు చెందిన రాజకీయవేత్త, అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ తో బుల్బుల్ సంబంధాలు కలిగి ఉన్నాడు.
గత ఏడాది అక్టోబర్ లో షేక్ హసీనా, షకీల్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, దానిపై ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదు అయింది. అయితే గతేడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితులతో ప్రధాని పదవి కోల్పోయిన హసీనా.. దేశం వదిలి ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై యూనస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా ఆమెను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు మహమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.