Allu Arjun: ‘పుష్ప-2’ సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

Allu Arjun extends financial support of Rs 25 lakhs: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప -2’. ఈ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో ఫ్యాన్ష్ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో లాఠీచార్జ్ చేయడంతో భయంతో పరుగులు తీయగా.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే యువతి ఊపిరాడక చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

తాజాగా, ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ఇటీవల పుష్ప 2 ప్రీమియర్స్‌కు వెళ్లిన సమయంలో విపరీతంగా రద్దీ ఉన్నది. సినిమా చూసిన తర్వాత ఉదయం ఓ వార్త తెలిసింది. ఈ సినిమాకు ఓ ఫ్యామిలీ వచ్చిందని, అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రేవతి మృతి చెందడంతో పుష్ప 2 టీం అంతా షాకయ్యామన్నారు. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోతున్నామన్నారు.

సినిమా ప్రేక్షుకుల కోసమే తీస్తున్నామని, ఇలాంటి ఘటన జరగడం బాధకరమన్నారు. మేము ఎలాంటి సహాయం చేసినా తక్కువేనని చెప్పుకొచ్చారు. రేవతి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నాన్నారు. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామన్నారు. అలాగే మా టీం నుంచి ఇంకా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.