Hydra Emergency Services: 4,100 మందితో హైడ్రా ఎమర్జెన్సీ సేవలు.. ఎందుకో తెలుసా?

Hydra Emergency Services: హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించింది. వాటర్ లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు గానూ హైడ్రా 150 ఎమర్జెన్సీ బృందాలు, 51 DRF టీమ్‌లు, చెత్త తొలగింపు సిబ్బంది, బైక్ బృందాలు, ట్రాఫిక్ సహా మొత్తం 4100 మంది సిబ్బందితో రంగం సిద్ధం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 24 గంటలూ అన్ని బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గతంలో GHMC ఆధ్వర్యంలో పనిచేసే మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఇకపై హైడ్రా ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. ఒక్కో షిఫ్టులో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. వర్షపు నీరు నిలిచే చోట రెండు షిఫ్టుల్లో పనిచేసేలా 734 మంది సిద్ధమయ్యారు. వీరితో పాటు హైడ్రా 51 DRF బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలొ 18 మంది సిబ్బంది ఉంటారు. 150 బృందాల్లో 1800 మంది సిబ్బంది ఉంటారు.
మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వర్షాలకు రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. కల్వర్డులను, నాలాలను పరిశీలించి వరద నీటి ప్రవాహం వెళ్లేలా జాగ్రత్తపడాలని సూచించారు. అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయా ప్రాంతాల్లో హైడ్రా ఎస్ఎఫ్‌వోలకు తెలియజేయాలని, అదేవిధంగా ఆ సమాచారాన్ని హైడ్రా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించడానికి కటింగ్ మిషన్లు, చెత్తలను తొలగించడానికి అవసరమైన పరికరాలన్ని 150 స్టాటిక్ టీమ్‌లతో పాటు 51 డీఆర్ఎఫ్ బృందాలకు అప్పగించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో 20 టీమ్‌లు పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు వాహనాలను, పనిముట్లను కూడా హైడ్రా సమకూర్చింది. వర్షకాలంలో పనిచేసే ఈ బృందాలకు శిక్షణ ఇచ్చారు.