No Detention Policy: ‘నో డినెన్షన్‌’కి కేంద్రం మంగళం.. ఇక ఆ వార్షిక పరీక్షల్లో పాస్ కావాల్సిందే!

Centre Scraps ‘No Detention Policy’ For Classes 5 and 8: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్‌కు సంబంధించిన నో డినెన్షన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు తమ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై వారంతా తప్పనిసరిగా ఆయా తరగతులలో ఉత్తీర్ణత సాధించాలి.

రెండు నెలల్లో మళ్లీ పరీక్ష
నేడు కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పాస్ కాకపోతే, అతడిని పైతరగతులకు ప్రమోట్‌ చేయరు. కాకపోతే, మళ్లీ పరీక్ష రాసేందుకు 2 నెలల సమయం ఇస్తారు. ఈసారీ అతడు పాస్ కాకపోతే గత ఏడాది చదవిన క్లాసునే మరో ఏడాది పాటు చదవాల్సి ఉంటుంది. కాగా, ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాల్లో ఏం చేస్తారో?
విద్యాహక్కు చట్టం -2019కి చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే తమ పాఠశాలలలో 5, 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. హర్యాణా, పుదుచ్చేరి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోకపోగా, తెలంగాణ, ఏపీలో 5, 8 వ తరగతిలో ఫెయిల్ అయినా, తర్వాతి క్లాసుల్లోకి అనుమతిస్తున్నారు. అయితే పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఇక.. దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కేంద్రం తాజా నిర్ణయం మంచిదేనని, దీనిని రాష్ట్రాలు కూడా పాటిస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని విద్యావేత్తలు సూచిస్తున్నారు.