Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో పాటు కోస్తాంధ్ర తీరం ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఏర్పడనుందని తెలిపింది. అలాగే రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కింది.