Trade Deal: రెండు రోజుల్లో భారత్- అమెరికా ట్రేడ్ డీల్

India- US Trade Deal: భారత్- అమెరికా మధ్య మరో భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి వచ్చే రెండు రోజుల్లో కీలక ప్రకటన రానుందని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇరుదేశాల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే భారత్ తో భారీ ఒప్పందం జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల గడువు కూడా ఈనెల 9తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం వేగంగా అడుగులు పడుతున్నట్టు సమాచారం.
రెండు రోజుల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ విధించిన వాణిజ్య ఒప్పందంతో భారత్ లోని రైతులకు నష్టం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై భారత్ అంగీకారం తెలపడం లేదని సమాచారం. వ్యవసాయం, పాడి రంగాలకు ఎక్కువ మార్కెట్ అవకాశాల కోసం అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రతపై భయాందోళనలు తలెత్తే అవకాశం ఉంది. భారత్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అయితే ఇరుదేశాల మధ్య సంతృప్తికర విధంగా వాణిజ్య చర్చలు ముగుస్తాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ కనుక విఫలమైతే పరస్పర సుంకాల రేటు 10 నుంచి 27 శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది. దీనివలన భారత్ లో ధరలు పెరిగే అవకాశం ఉంది.