Last Updated:

CM KCR: ’మునుగోడు‘ పై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు

మునుగోడు, తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంటే అక్కడ వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది.

CM KCR: ’మునుగోడు‘ పై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు

Munugode By Poll: మునుగోడు, తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంటే అక్కడ వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో గెలవడం కోసం మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికలకు మునుగోడు ఫలితం రిఫరెండంలా భావించడమే ఇందుకు కారణం. మునుగోడులో గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్, ఆ దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ పరంగా ఎంత చేసినా, ప్రజలను కలిసినా, అసంతృప్త నేతలను సంతృప్తిపరచాలనేది కేసీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ముందుగా, అసంతృప్త నేతలపై టీఆర్ ఎస్ అధినేత దృష్టి పెట్టారు. స్థానిక నాయకులందరినీ ఇప్పటికే బుజ్జగించగా, టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కర్నాటి ప్రభాకర్‌ను సైతం లైన్లో పెట్టారు. పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు రెడీ అయిన నేపథ్యంలో భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని, కేసీఆర్ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అదేసమయంలో స్థానికంగా, వారికి ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయిస్తామని, హామీ ఇచ్చినట్టు సమాచారం. అదేవిధంగా ఇతర సమస్యల పై పరష్కారం కోసం కేటీఆర్‌కు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. దీంతో కీలకమైన ఈ ముగ్గురు శాంతించినట్టు గులాబీ వర్గాలు చెబుతున్నాయి.

కూసుకుంట్ల గెలుపు కోసం పనిచేస్తామని, ముగ్గురు స్వయంగా ప్రకటించడంతో పాటు, మునుగోడులోనే మకాం వేసేందుకు సిద్ధమయ్యారు. ఇది కేసీఆర్ సాధించిన తొలి విజయంగా చెబుతున్నారు పరిశీలకులు. ఎందుకంటే, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలను పరిశీలిస్తే, అక్కడ అసంతృప్తుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇది పార్టీ గెలుపు పై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ముందుగా అసంతృప్తులను బుజ్జగించే పనిచేపట్టారని అంటున్నారు. మరోవైపు, మునుగోడులోని 2 వేల మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి బాధ్యత అప్పగించారు. మొత్తం 86 మందిని ఇంచార్జిలుగా నియమించిన కేసీఆర్, ఒక్కో నాయకుడు వారి సొంత నియోజకవర్గం నుంచి కనీసం 20 మందిని మునుగోడుకు పంపించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగా ఇతర నియోజకవర్గాల నాయకులు మునుగోడులో దిగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం గ్రామాల్లో వసతి భోజనం ఏర్పాట్లు సిద్ధం చేశారు.

మరోవైపు టీఆర్ఎస్‌కు మద్దతునిస్తున్న సీపీఐ, సీపీఎం ఈ నెల 11న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాయి. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నామన్న విషయాన్ని లెఫ్ట్‌ పార్టీల నేతలు ప్రజలకు వెల్లడించారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వామపక్ష నేతలు చెబుతున్నారు. మొత్తంమీద క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు కేసీఆర్‌. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఉప పోరు ద్వారా, ప్రభుత్వం పై వ్యతిరేకత లేదనే సంకేతాలను పంపించాలని కేసీఆర్ భావిస్తున్నా రు. ఈ నియోజకవర్గంలో గెలుపు అధికార పార్టీకి అత్యంత కీలకంగా మారింది. మరి, మునుగోడు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి: