Indiramma Committees: ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సబబే.. తీర్పు వెలువరించిన హైకోర్టు

Indiramma Housing Committees: తెలంగాణలో ఇళ్లులేని పేదలందరికీ ఇందరిమ్మ పథకం కింద కట్టిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఖాళీ జాగాఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని చెప్పింది. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది. డిసెంబరు మొదటి వారంలో జాబితా రూపొందించాలని కృతనిశ్చయంతో ఉంది. గ్రామసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

జీవో 33ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌..
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 33ను జారీచేసింది. జీవోను సవాల్ చేస్తూ బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 సబబేనని పేర్కొంది. విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గ్రామసభ, వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

బీఆర్ ఎస్ హయంలో గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక..
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేసిందన్నారు. ఇందిరమ్మ కమిటీల సభ్యుల నియామకాలకు సంబంధించి జీవోలో ఎలాంటి అర్హతలను పేర్కొనలేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచ్ , ప్రత్యేకాధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ చైర్మనుగా ఉంటారని పేర్కొన్నారు.

గ్రామసభల ద్వారానే అర్హుల ఎంపిక..
స్వయం సహాయక గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు సభ్యులుగా ఉంటారని వివరించారు. లబ్ధిదారుల తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని, గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. దీంతో పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లిందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయం అంతిమం కాదని తేల్చిచెప్పారు. కలెక్టరుకు అందిన దరఖాస్తులపై గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డుస్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారన్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఇందిరమ్మ కమిటీలు సాయం మాత్రమే చేస్తాయని, అర్హుల ఎంపికకు గ్రామసభలకు చట్టం అధికారం కల్పించిందన్నారు. అనర్హులను ఎంపిక చేస్తే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చని విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.