TGPSC Group 2 Vs RRB: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు మరోసారి వాయిదాపడనున్నాయనే వార్తల నేపథ్యంలో వేలాది అభ్యర్థులు గందరగోళపడుతున్నారు. గ్రూప్ 2 పరీక్ష రోజునే మరో ప్రభుత్వ పరీక్ష ఉండటంతో గ్రూప్2ను రద్దుచేయాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరటంతో మరోసారి పరీక్ష వాయిదా తప్పదని అభ్యర్థులు భయపడుతున్నారు.
ఒకే రోజు రెండు పరీక్షలు
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా మొత్తం 4 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1,3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2,4 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, గ్రూప్-2 పరీక్ష రెండవ రోజు (16వ తేదీన) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ల భర్తీకి కూడా పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఒకే రోజు రెండు పరీక్షలలో ఒకదానిని రాసే అవకాశాన్ని కోల్పోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు పరీక్షల్లో ఏదో పరీక్షను వాయిదా వేయాలని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
డిసెంబర్ 9 నుంచి హాల్‌టికెట్లు
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 9 నుంచి విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉద్యోగాలకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణ మీద కమిషన్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.