Site icon Prime9

Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్.. 300 దాటిన ఎక్యూఐ సూచీ

Hyderabad in Danger Zone With the High Polution:హైదరాబాద్‌ నగరంలో వాయుకాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలోని దుస్థితే ఇక్కడా ఎదురుకాక తప్పదని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా, ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి, తగిన నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే రాజధాని జనావాసానికి పనికి రాకుండా పోతుందని వారు వివరిస్తున్నారు.

300 దాటిన ఏక్యూఐ
హైదరాబాద్‌ నగరంలో ఆదివారం గాలి నాణ్యత ఒక్కసారిగా తగ్గిందని, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 దాటిపోవటం దీనినే సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నగరంలోని కూకట్‌పల్లి, మూసాపేట్‌, బాలానగర్‌, నాంపల్లి, మెహదీపట్నంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే చలితో చిన్నారులు, వృద్ధులు గడగడలాడుతుండగా తాజాగా కాలుష్యం పెరిగిపోవడంతో ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయనుందని వైద్యులూ చెబుతున్నారు.

ఆ రెంటిదే వాటా..
నగరంలో వెలువడుతున్న కాలుష్యంలో రవాణా రంగం, పారిశ్రామిక రంగాలదే సింహభాగంగా ఉంది. నగరంలో పలు హాని కారక పరిశ్రమలు నిర్వహించటం, నగరంలో కాలం చెల్లిన వాహనాలు యధేచ్ఛగా తిరగటం, గతంలో మాదిరిగా ఇప్పడు నగరంలోని రహదారుల పక్కన చెట్ల పెంపకం లేకపోవటం వల్ల వాయుకాలుష్యం బాగా పెరిగిపోయింది. కాలుష్యాన్ని వెలువరించే వాహనాలను పట్టుకుని కేసులు పెట్టాల్సిన ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాయటానికే పరిమితం కావటంతో నగరంలో వేలాది కాలం చెల్లిన వాహనాలు కాలుష్యాన్ని వెలువరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఏక్యూఐ చెప్పేదేంటి?
* ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత సంతృప్తికరం
* ఏక్యూఐ 51 నుంచి 100 మధ్య ఉంటే ఆమోదయోగ్యం
* ఏక్యూఐ 101 నుంచి 150 మధ్య ఉంటే సున్నితమైన వారికి అనారోగ్యం
* ఏక్యూఐ 151 నుంచి 200 మధ్య ఉంటే డేంజర్ జోన్
* ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయి అధికం
* ఏక్యూఐ 301కి పైగా నమోదైతే అత్యవసర పరిస్థితి

Exit mobile version