Site icon Prime9

Mohan Bhagwat: భిన్నత్వంలోనూ ఏకత్వాన్ని చూద్దాం.. మంచి చెడూ నిర్ణయించేది మన మనసే

RSS Chief Mohan Bhagwat Speech in Lokmanthan Bhgyanagar At Hyderabad: భిన్నత్వంలోనే ఏకత్వాన్ని దర్శించటం భారతీయ సంస్కృతి గొప్పదనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో గత 4 రోజులుగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమపు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిషన్‌ రెడ్డి, గజేంద్ర షెకావత్‌ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

సంతోషం ఎక్కడుంది?
నేటి బిజీ లైఫ్‌లో ప్రజలంతా ఆనందం కోసం బయటి వనరులను, వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని కానీ, నిజానికి సరిగా అర్థం చేసుకోగలిగితే ఆ ఆనందం మన మనసులోనే ఉందని భాగవత్ వివరించారు. ఈ విషయాన్ని మన బుుషి పరంపరంలోని ఎందరో వందల ఏండ్ల నాడే వివరించారన్నారు. భౌతిక జీవనం ఎలా సాగించాలో మన పూర్వీకులు స్పష్టంగా నిర్దేశించారని భాగవత్ వివరించారు. వారి ఆలోచనా విధానంలో మనది సనాతన దేశమని అన్నారు.

ధర్మస్థాపనకే ఆధ్యాత్మిక
ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలతో ఉంటే సమాజంలో ధర్మం దానంతట అదే నిలబడుతుందిని మోహన్ భాగవత్ అన్నారు. కానీ, ఆధ్యాత్మికత లేమి కారణంగా దేశంలో ధర్మం కంటే అధర్మమే పెరిగిందన్నారు. నేటి సమాజంలో సైన్స్ కారణంగా అనేక ఆవిష్కరణలు, సౌకర్యాలు వచ్చాయని, అయితే, సైన్స్‌ను మనం ఎలా వినియోగించుకుంటున్నామో అందరూ ఆలోచించాలని అన్నారు. ధర్మ స్థాపన కోసం అందరూ కంకణ బద్ధులు కావాలని, ఈ క్రమంలో మన ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయాలని సూచించారు.

ఏఐ మీద కామెంట్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ నైతికతపై చర్చ జరుగుతుందని, మనిషి బుద్ధి, హృదయ వైశాల్యాన్ని బట్టి ఏఐని వాడుకోవాల్సి ఉందన్నారు. టెక్నాలజీ ఏదైనా దానికదే మంచిదనో చెడ్డదనో చెప్పలేమని, దానిని వాడే మనిషి బుద్ధిని బట్టే అంతా ఆధారపడి ఉంటుందన్నారు.

అందరూ మనవారే..
ఎదుటి వారిని జయించాలని, వారి మీద పై చేయి సాధించాలనే ఆలోచనలు తగవని మోహన్ భాగవత్ అన్నారు. మనం ఎవరికి శత్రువులము కాదు… ఎవరూ మనకు శత్రువులు కారన్నారు. ‘మనం ఇతరుల గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్‌లోకి మొత్తం ప్రపంచాన్ని తీసుకురావాలి’అన్నారు. మన దేశం వందల ఏళ్ల పాటు విదేశీయుల దురాక్రమణలో మగ్గినా, వారు ఈ దేశపు సంస్క‌ృతిని మార్చలేకపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, అదే భారత్ గొప్పదనమన్నారు.

ఓర్వలేకపోతున్నారు: కిషన్ రెడ్డి
భారత్ అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయని, అందుకే అవి దేశంలో అరాచకం సృష్టించే యత్నాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్దారు. కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ శాంతి సందేశాలను మోసుకుపోతున్నారని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం అందరం కలిసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

అందరం భారతీయులమే : నిర్మల
మన నాగరికతలో వనవాసి, నగరవాసి, గ్రామ వాసి అనే వర్గాలున్నాయని, అయితే అవి వైవిధ్యాన్ని గురించి చెప్పేవే తప్ప సమాజాన్ని విభజించేవి కాదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు నాలుగు పీఠాలు స్థాపించారని గుర్తుచేశారు. తన బాల్యంలో కంచి పరమాచార్య చంద్రశేఖరాచార్య సరస్వతి బోధనలు విన్నానని గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోని కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామిని మిగిలిన వారికంటే ఆదివాసీలే ఎక్కువగా ఆరాధిస్తారని గుర్తుచేశారు. ఆదివాసీల పట్ల వివక్ష ఉందని కొందరు అక్కడక్కడ మాట్లాడుతున్నారని, అయితే మనమంతా భారతీయులమేనని ఆమె అన్నారు.

ధర్మ పరిరక్షణ జరగాలి : గజేంద్రసింగ్ షెకావత్‌
సనాతన ధర్మాన్ని కాపాడేందుకు లోక్‌ మంథన్‌ వంటి కార్యక్రమాలు మరిన్ని దేశ వ్యాప్తంగా జరగాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ఎన్ని దండయాత్రలు జరిగినా, ఈ దేశం తన ధర్మాన్ని, సంస్కృతిని వదిలిపెట్టలేదని, లోక కల్యాణం నుంచి విశ్వ కల్యాణం వరకు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడమే మన ధర్మం అన్నారు. గతంలో జరిగిన విధ్వంసం నుంచి భారత్‌ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం సంతరించుకుంటోందన్నారు.

Exit mobile version