Hemant Soren meets Governor at Raj Bhavan: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విపక్ష కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అధ్యక్షతన ఆదివారం భేటీ అయిన భాగస్వామ్య పక్షాలు.. కూటమి నేతగా హేమంత్‌ను ఎన్నుకున్నాయి. అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన హేమంత్.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలిపారు. ఇందుకు సంబంధించి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు.
28న ప్రమాణం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 28న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. కూటమి తరఫున ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామన్నారు. రాజీనామాను గవర్నర్‌కు సమర్పించానన్నారు. కాగా, హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని కాంగ్రెస్ నాయకుడు సుబోధ్‌కాంత్ సహాయ్ తెలిపారు. నవంబర్ 28న జరిగే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలైనట్లు తెలిపారు.
తరలి రానున్న నేతలు..
హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదిపార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, జేఎంఎం నాయకత్వంలోని ఇండియా కూటమి మొత్తం 81 స్థానాలకు గానూ 51 సీట్లు గెలుచుకుని విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈసారి బిజెపి కూటమి 27 స్థానాలకే పరిమితమైంది.