Last Updated:

Salt Consumption: ఉప్పు ఎక్కువైందో.. ఇక అంతే సంగతులు

వంటల్లో ఉప్పు ఎక్కువైనా.. తక్కువైనా అసలు తినలేము. ఉప్పు మన జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే అదే ఉప్పుతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు

Salt Consumption: ఉప్పు ఎక్కువైందో.. ఇక అంతే సంగతులు

Salt Consumption: వంటల్లో ఉప్పు ఎక్కువైనా.. తక్కువైనా అసలు తినలేము. ఉప్పు మన జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే అదే ఉప్పుతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మనిషి రోజులో 2400 మిల్లీ గ్రాముల ఉప్పును మాత్రమే తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 2400 మిల్లీ గ్రాములు అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుతో సమానం. కానీ మనం ఒక పెరుగు అన్నంలోనే దాదాపు ఆ పరిమాణంలో ఉప్పును వాడతాం. అంటే తినాల్సిన దానికంటే చాలా ఎక్కువ మోతాదులో ఉప్పును వాడుతున్నామని అర్థం. అయితే ఉప్పు వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది.

2030 నాటికి 70 లక్షణాల మరణాలు(Salt Consumption)

ఉప్పును తగ్గించుకోకుంటే ముప్పు తప్పదని వెల్లడించింది. సోడియం వినియోగం తగ్గింపు విషయంలో ప్రపంచం వెనుకబడుతోందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. సోడియం ఇన్ టేక్ రిడక్షన్ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా 2030 నాటికి 70 లక్షణాల మరణాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. అధిక సోడియం వినియోగం వల్ల గుండె పోటు ప్రమాదం , అకాల మరణాల లాంటివి సంభవిస్తున్నాయి.

కాబట్టి ప్రస్తుత వాడకం కంటే 30 శాతం తగ్గించే దిశగా క‌ృషి చేయాలని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. 2025 కల్లా 30 శాతం మేర తగ్గించాలనే దిశగా దేశాలు సాగడం లేదని ఆ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ సోడియం తలసరి వినియోగం సగటున రోజుకు 10.8 గ్రాములుగా ఉంది. అయితే అది ఒక టీస్పూన్ కు మించి ఉండకూడదని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. హెల్త్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల్లో కేవలం 5 శాతం మాత్రమే లక్ష్యం దిశగా కృషి చేస్తున్నాయని తెలిపింది.

 

మరెన్నో సమస్యలు..

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే అది నేరుగా రక్త ప్రసరణను ఇబ్బంది పెడుతుంది. ఉప్పు అధికంగా ఎలక్ట్రోలైట్‌లను నియంత్రించడం వల్ల రక్తపోటుకు కారణమవుతుంది. ఉప్పు అడ్రినల్‌ గ్రంధులను ఉత్తేజ పరుస్తుంది. దీంతో వడదెబ్బకు గురైన వారికి ఉప్పు మేలు చేస్తుంది. ఉప్పు శరీరంలోని మినరల్స్‌ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు కానీ క్రమేపి తీవ్రమైన సమస్యలకు గురవుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధికంగా ఉప్పును వినియోగిస్తే రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అయితే రోగ నిరోధక శక్తి ఉన్నవారికి ఇలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

మనం ఎక్కువగా ఉప్పును తీసుకుంటే శరీరం నుంచి నీటిని ఫిల్టర్‌ చేసే మూత్రపిండాల సామర్థ్యం కోల్పోవచ్చు. కిడ్నీలు రక్తంలో అధిక ఉప్పును నియంత్రించడానికి అధికంగా ప్రయత్నిస్తుంది. దాంతో వాటికి అదనపు ఒత్తిడి పెరిగి మూత్ర పిండాల వ్యాధికి కారణమవుతుంది.

ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటే అందులో ఉండే సోడియం ఎముకల్లో ఉండే కాల్షియానికి నష్టం చేస్తుంది. దీంతో ఎముకల్లోని బలం క్షీణించి ఓస్టియోపెరిసిస్‌ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే అవకాశం ఉంది.