Chhaava Telugu Trailer: బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఛావా ఇప్పుడు తెలుగులో.. ట్రైలర్ చూశారా.. గూస్ బంప్స్ గ్యారెంటీ

Chhaava Telugu Trailer: ఛావా.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా. బాలీవుడ్ కుర్ర హీరో విక్కీ కౌశల్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. పుష్ప 2 రిలీజ్ అయిన డిసెంబర్ 4నే ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సిఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఛావా ఈ ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా హిందీలో రికార్డులు కొల్లగొడుతుంది. రూ. 500 కోట్లకు పైగా కలక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతుంది. మంచి సినిమాలు ఎక్కడున్నా.. ఏ భాషలో అన్నది చూడకుండా తెలుగువారికి అందించే సంస్థలో గీతా ఆర్ట్స్ ముందు ఉంటుంది.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కథ కూడా తెలుగువారు తెలుసుకోవాలనే కాంక్షతో ఛావా తెలుగు రైట్స్ ను అల్లు అరవింద్ భారీ ధరకు కొనుగోలు చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఛావా సినిమా తెలుగులో మార్చి 7 నుంచి థియేటర్ లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా ఛావా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
‘‘ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనాబ్’’ అని ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. శివాజీ మరణించాకా.. ఆ రాజ్యాన్ని మొఘలాయిలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇక తండ్రి మరణం తరువాత.. మరాఠీల సింహాసనాన్ని కాపాడడానికి ఆయన కుమారుడు ఛావా యుద్ధం మొదలుపెడతాడు. ఔరంగజేబు నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఛావా ఎలాంటి యుద్దాలు చేశాడు.. ? చివరికి ఆ యుద్ధాల్లో గెలిచాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. వీరోచిత పోరాటాలు.. యుద్ధ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పుడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఛావా భార్య యేసుబాయిగా రష్మిక అద్భుతంగా కనిపించింది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నెక్స్ట్ లెవెల్ లో కనిపించాడు.
ఇక సినిమా మొత్తానికి హైలైట్ అంటే ఏఆర్ రెహమాన్ సంగీతం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో హిస్టారికల్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో మెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఛావా కూడా అదే రీతిలో అభిమానులను అలరిస్తుందని టాక్ నడుస్తోంది. మరి హిందీలో అదరగొట్టిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.. అల్లు అరవింద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.