Last Updated:

Kurnool: భర్త శవాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

Kurnool: భర్త శవాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య

Kurnool: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పత్తికొండ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్‌ (60), లలిత భార్యాభర్తలు. వీరు మెడికల్‌ షాపు నిర్వహిస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెద్ద కొడుకు దినేశ్ పనిచేస్తుంటాడు. చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.

 

అసలు జరిగిందేంటంటే?( Kurnool)

అయితే సోమవారం ఉదయం హరికృష్ణ ప్రసాద్‌ ఉంటున్న ఇంటి నుంచి పొగలు రావడాన్ని కాలనీ వాసులు గమనించారు. దీంతో ఏమైందో అనే భయంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్సై ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడి భార్య లలితతో మాట్లాడి,.. అసలు విషయం తెలుసుకున్నారు. సోమవారం ఉదయం తన భర్త అనారోగ్యం తో మృతి చెందినట్టు ఆమె పోలీసులకు తెలిపింది.

తమను కొడకులిద్దరూ సరిగా చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇపుడు తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులు ఇద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని తెలిపిందన్నారు. ఆ భయంతో లలితే భర్తకు అట్టపెట్టెలు పేర్చి పోట్రోల్ పోసి అంత్య క్రియలు పూర్తి చేసినట్టు తెలిపారు.

 

సజీవ దహనమా?( Kurnool)

అయితే ఇంట్లోనే దహన సంస్కారాల ఘటనపై మరో కోణం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. లలిత చెబుతున్నట్టు దహన సంస్కారాలు కావని.. భర్తను సజీవదహనం చేసిందని స్థానికలు కొందరు ఆరోపిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తకు సేవ చేయలేక, లలిత అతడిని బతికుండగానే దహనం చేసిందని అంటున్నారు. హరికృష్ణ కొన్నేళ్లుగా అనారోగ్యంతో హరికృష్ణ మంచం పట్టారని.. కదలలేని స్థితిలో ఉన్న భర్తను చాలాకాలంగా భార్య లలిత చూసుకుంటుందని తెలిపారు.

ఇద్దరు కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఓ వైపు కొడుకులు పట్టించు కోకపోవడం, తాను కూడా భర్తను చూడలేకనే ఇంట్లోనే అట్టపెట్టెలతో భర్తను దహనం చేసి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే లలిత మాత్రం తన భర్త గుండెపోటుతో మరణించాడని తెలిపింది. భర్త చనిపోయిన తర్వాతే దహన సంస్కాలు చేశానని చెబుతోంది లలిత. కాగా, పోలీసులు సజీవ దహనం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.