FASTag Annual Pass: ఫాస్టాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 3వేలు రీఛార్జ్‌తో ఎక్కడైనా తిరగొచ్చు.. !

Nitin Gadkari announced FASTag Yearly Pass Rs 3,000: కేంద్రం వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేదిశగా ఈనిర్ణయం తీసుకుంది. వాహనదారులకోసం ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్‌ను కేవలం మూడువేలకే అందించనున్నట్లు తెలిపింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే ఒక సంవత్సరం పాటు దేశంలోని అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంపట్ల డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తంచేసారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే పవన్ రెస్పాన్స్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ స్కీమ్ కు ప్రచారం కల్పించడానికే పవన్ ట్వీట్ చేసారా.. లేదా కేంద్రప్రభుత్వానికి మద్దతు తెలిపేక్రమంలో స్పందించారా అన్న చర్చ జరుగుతోంది.
భారత టోల్ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా డిజిటల్ రూపంలో టోల్ టాక్స్ కలెక్ట్ చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్‌ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈయాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.