ANR National Award: ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుక – అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని అవార్డు
ANR National Award 2024 : ఏఎన్ఆర్ జాతీయ పురస్కార వేడుక నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభం అయ్యింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదులుగా చిరంజీవి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకొనున్నారు. కాగా ఇటీవల కింగ్ నాగార్జున, చిరును ప్రత్యేకంగా కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది ANR National Award 2024 అవార్డును చిరంజీవికి ప్రదానం చేస్తున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించారు.
కాగా ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, విక్టరి వెంకటేష్, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, నటుడు ప్రకాశ్ రాజ్, ఎమ్ఎమ్ కిరవాణి వంటి ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ప్రతి ఏటా నాగార్జున ఘనంగా నిర్వహిస్తారు. చిత్ర పరిశ్రమలో విశిష్ట సేవలు అందించే వారికి ఏఎన్ఆర్ స్మారక పురస్కారంతో సత్కరిస్తారు. అలా ఈ ఏడాది సినీరంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ ‘పద్మవిభూషణ్’ చిరంజీవికి అవార్డును ప్రదానం చేయనున్నారు.