CM KCR: విజయవాడకు సీఎం కేసీఆర్.. మరి జగన్ మనసులో ఏముందో..
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నారని, అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
Hyderabad: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నారని, అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దీంతో వైఎస్ జగన్ కూడా తెలంగాణ వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మళ్లీ మూడేళ్ల తర్వాత కేసీఆర్ విజయవాడకు వెళ్తున్నారు. అయితే కేసీఆర్ వచ్చేది సీపీఐ జాతీయ మహాసభలకు అని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. సీపీఐ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతలు వస్తారని సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. అలాగే 23 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల నేతలు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరవుతారని చెప్పారు.
ఈ నేపథ్యంలో విజయవాడకు వెళ్లనున్న కేసీఆర్, కేవలం సీపీఐ జాతీయ మహాసభలకే పరిమితమవుతారా లేదంటే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కూడా కలుస్తారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా కేసీఆర్, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద వైఎస్ జగన్‌ను కేసీఆర్ ఇంతవరకు కలవలేదు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలసి థర్డ్ ఫ్రంట్‌లో చేరాలని కోరతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మరోవైపు, తెలంగాణలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ తరుముకుని వస్తుండటంతో కమ్యూనిస్టులతో చెలిమి చేయని పరిస్థితి కేసీఆర్‌కి ఏర్పడింది. మునుగోడులో కమ్యూనిస్టులకు మంచి బలం ఉంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కమ్యూనిస్టులే విజయం సాధించారు. అలాగే, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరితో కలిసి సాగాలని కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఉండే ఓట్ల శాతం టీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ జాతీయ మహాసభలకు హాజరవుతున్నారని అంటున్నారు.