Gangavaram Port: సమ్మెవిరమించిన గంగవరం పోర్టు కార్మికులు
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే
Gangavaram Port: నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే .పోర్ట్ అధికారులు ,కార్మికసంఘాల నాయకులూ , ప్రభుత్వ అధికారులు దీనిపై చర్చలు జరిపారు . ఒన్ టైమ్ సెటిల్మెంట్ జరిగె అవకాశాలు కనబడుతున్నాయి .
స్టీల్ ప్లాంట్ కు ఊరట..( Gangavaram Port)
అయితే గంగవరం పోర్టు నుంచి దిగుమతి అయ్యే ముడి పదార్దాల మీద ఆధారపడిన విశాఖ స్టీల్ ఫ్లాంట్ కు ఇప్పుడు కొంచెం ఊరట లభించినట్లయింది .ముఖ్యంగా గంగవరం నుంచి కోకింగ్ కోల్ స్టీల్ ప్లాంట్ కు సరఫరా అవుతోంది . ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న స్టీల్ ప్లాంట్ . గంగవరం పోర్ట్ లో కార్యక్రమాలు ఆగిపోవడంతో చాలా వరకు ఉత్పత్తి నిలిపివేసింది. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే పరిశ్రమ మూతపడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితిలో గంగవరం పోర్ట్ కార్మికులు సమ్మె విరమించడంతో స్టీల్ ప్లాంట్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఉత్పత్తికి కావాల్సిన సుమారు 60 వేల టన్నుల కోకింగ్ కోల్ ప్రస్తుతం గంగవరం పోర్టులో ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. కార్మికులు మొదట్లో పెట్టిన డిమాండ్లను తగ్గించుకుని ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కోసమే విధులకు హాజరవుతున్నామని తెలిపారు.
ఇంకా సంక్షోభంలోనే విశాఖ ఉక్కు..
విశాఖ స్టీల్ ప్లాంటుకు గంగవరం పోర్టు నుంచి బొగ్గు, లైమ్‌స్టోన్ ,కోకింగ్ కోల్ సరఫరా అవుతుంది . ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి స్టీల్ ప్లాంటు యాజమాన్యం కోకింగ్ కోల్ తెప్పించుకుంటే అది పోర్టులో చిక్కుకు పోయింది. స్టీల్‌ప్లాంటులో నెలకు రూ.2,500 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. రోజుకు సగటున 20 వేల టన్నుల స్టీల్ తయారుచేస్తారు. బొగ్గు, ఇతర ముడిపదార్థాలు అందుబాటులో లేకపోవడం వల్ల గత ఏప్రిల్ నెలలో రూ.1,250 కోట్ల విలువైన స్టీల్‌నే తయారుచేశారు. వివిధ వర్గాల నుంచి రూ.800 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకోవడంతో వారంతా 70 శాతానికి పైగా ఉత్పత్తులు తీసుకుపోయారు. స్టీల్ నిల్వలు కూడా పడిపోయాయి. మే నెలకు వచ్చేసరికి ఉత్పత్తి మరీ తగ్గిపోయింది. ఈ నెల 14వ తేదీ నాటికి 70 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. వాస్తవానికి వేయి కోట్ల రూపాయలకుపైగా విలువైన ఉత్పత్తులు తయారు చేయాల్సి ఉండగా కేవలం రూ.370 కోట్ల విలువైన ఉత్పత్తులే తయారయ్యాయి. అసలే నష్టాల్లో వున్న స్టీల్ ప్లాంట్ కు మూలిగే నక్క మీద తాటి కాయ పడినట్లు గంగవరం పోర్ట్ కార్మికుల సమ్మె మరో దెబ్బ వేసింది .