Gang Rape : దళిత మహిళపై వైకాపా నేతల సామూహిక అత్యాచారం.. కేసు నమోదు చేయకుండా నిద్రపోతున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతున్నవారిలో పోలీసులు కూడా ఒకరు. సాధారణంగా అసలు పని చేయకుండా.. కొసరు పనులు చేస్తూ ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే వారిలో రాజకీయ నేతలు మొదట ఉంటే.. వారి తర్వాత పోలీసులు ఉంటారని సగటు మనిషి అభిప్రాయపడుతుంటారు.
Gang Rape : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతున్నవారిలో పోలీసులు కూడా ఒకరు. సాధారణంగా అసలు పని చేయకుండా.. కొసరు పనులు చేస్తూ ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే వారిలో రాజకీయ నేతలు మొదట ఉంటే.. వారి తర్వాత పోలీసులు ఉంటారని సగటు మనిషి అభిప్రాయపడుతుంటారు. పోలీసులు అంటే పబ్లిక్ సర్వీస్ కాకుండా.. రాజకీయ నాయకుల సర్వీస్ చేస్తూ.. లంచాలకు అలవాటు పడి డబ్బులు ఉన్నోళ్ళకే కానీ సాధారణ ప్రజలకు న్యాయాన్ని అందకుండా.. చేసే వారిలా మిగిలిపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో అయితే ప్రభుత్వాలు మారితే చాలు.. ఏ ప్రభుత్వం ఉంటే వారికే న్యాయం.. ఇంక వారికి ఆ ఉద్యోగాలు ఎందుకు అంటూ ఇప్పటికే పలువురు ప్రజా సంఘాల నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం గమనించవచ్చు.
కాగా తాజాగా పోలీసుల నిర్లక్ష్య ధోరణికి అర్ధం పట్టేలా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళపై వైకాపా నాయకులు సామూహిక అత్యాచారం చేసి వీడియో తీశారు. ఆ తర్వాత బెదిరించి ఏడాదిగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఎదిరించిన ఆమెను విచక్షణ రహితంగా కొట్టి, చంపేస్తామంటూ బెదిరించారు. మృగాళ్ల వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి.. రోజులు గడుస్తునా కేసు నమోదు చేయకుండా తిప్పుకుంటున్నారు. చివరికి దిక్కుతోచని స్థితిలో ఆ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నేడు 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ మనుష్యులు అందరూ సమానమే అనే విషయాన్ని కొందరు మూర్ఖులు ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి మూర్ఖులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి వల్లే ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దళితులపై ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా పలు రీతుల్లో పలు కారణాలు చూపుతూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఒంటరి మహిళ విషయంలో కూడా ఆమెకు న్యాయం జరగడానికి ఆమె సామాజిక వర్గం అడ్డుగా మారింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళకు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త మానసిక దివ్యాంగుడని తెలిసి ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ కూలీ పనులతో జీవనం సాగిస్తోంది. ఆమెపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు అయిదుగురు కన్నేశారు. ఏడాది కిందట వారంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోన్లలో వీడియోలు తీశారు. వాటిని చూపి బెదిరిస్తూ తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పైగా ఆ వీడియోలను నిందితులు అదే గ్రామానికి చెందిన బోయ హరికి పంపించగా.. అతడు కూడా ఆమెను లైంగికంగా వేధించసాగాడు. వీరి వేధింపులు తాళలేక రెండు నెలల కిందట బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా కొద్దిలో ప్రాణాలతో బయటపడింది. అయినా ఆమెను వదల్లేదు. ఈనెల 10న బాధితురాలు ఇంట్లో ఉండగా హరి బలవంతం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు తప్పించుకోకుండా ఇంటి బయటి నుంచి తలుపులు మూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు హరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కానీ, అదేరోజు సాయంత్రం వదిలిపెట్టేశారని బాధితురాలు ఆరోపించారు.
ఎస్ఐ చిన్న కేసే కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు – బాధితురాలి బంధువులు
ఈనెల 11న బాధితురాలు బంధువులతో కలిసి వెళ్లి కళ్యాణదుర్గం గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన పోలీసులు తాత్సారం చేస్తూ వచ్చారు. బాధితురాలు గ్రామపెద్దలతో కలిసి రెండ్రోజుల కిందట మళ్లీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి అడగ్గా.. అక్కడి ఎస్‌ఐ ఇది చిన్న కేసే కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. నిందితులు వైకాపా వర్గీయులు కావడం వల్లే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుల్లో ఒకరు గ్రామ వాలంటీరు సోదరుడు కాగా.. మరొక వ్యక్తి అయిన హరి వైకాపా ప్రజాప్రతినిధి అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ముగ్గురు నిందితులు వైకాపాలో కీలక నాయకుడికి బంధువులు కావడంతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలున్నాయి.
ఇక మరోవైపు వివాహితపై గ్యాంగ్ రేప్ చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని డీఎస్పీ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధితురాలు ఈనెల 10న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన హరి అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేశారన్నారు. దానిపై నిందితుడిని పిలిపించి విచారించారన్నారు. బాధితురాలు సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తోందని తెలుసుకున్న కళ్యాణదుర్గం గ్రామీణ ఎస్‌ఐ సుధాకర్ అనంతపురం వచ్చి ఎస్పీ కార్యాలయ సమీపంలో బాధితురాలిని, ఆమె బంధువులను అడ్డుకున్నారు. ‘మీకు న్యాయం చేయనని చెప్పానా? నిందితుల్లో ఒకడిని తీసుకొచ్చి కొట్టాను కదా’ అంటూ బుకాయించాడని బాధితురాలి బంధువులు తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వస్తే చిన్న కేసే కదా అంటూ నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడారంటూ వారు నిలదీశారు. దీంతో ఎస్‌ఐ వెళ్లిపోయారు. తర్వాత బాధితురాలు ఎస్సీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులుతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో మహిళకి న్యాయం జరగకపోవడం మరింత బాధాకరం అని స్థానికులు వాపోతున్నారు.