TS Assembly: టిఎస్ఆర్టీసిని అమ్మాలని కేంద్రం లేఖ
సుదీర్ఘ చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసిని అమ్మాలని క్రేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే లేఖలు వ్రాస్తుందని అసెంబ్లీలో సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
Hyderabad: రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన కేసిఆర్, కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన వారికి పాయింట్ 5శాతం ఎఫ్ఆర్బీఎం అదనంగా ఇస్తామని చెప్పారు. ఇది అన్యాయమని గతంలోనే చెప్పాను. నిర్ధిష్ట ప్రణాళికలతో అవసరమైన నిధులను రాష్ట్రానికి మంజూరు చేయకుండా, మీరు ఆర్టీసిని అమ్మేయండి అంటూ వెయ్యి కోట్లు బహుమతిని కేంద్రం పెట్టిందని దుయ్యబట్టారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు పంపుతున్నారు. ఎవరు ముందస్తుగా అమ్మితే వారికి బహుమతి పేరుతో తెలంగాణా అభివృద్దిని అడ్డుకొంటున్నారని కేసిఆర్ అన్నారు.
కేంద్రం విధానాలపై ధ్వజమెత్తిన కేసిఆర్ మీటర్ పెట్టకుండా విద్యుత్ కనెన్షన్ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్లో ఉన్నదన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో మీటర్ పెడితే ఒప్పుకొనేది లేదంటూ విద్యుత్ కార్యాలయాల వద్ద కుప్పలు పోసి తగలపెట్టారని గుర్తుంచుకోవాలని కేసిఆర్ గుర్తు చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తామని ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తీయని మాటలు మాత్రం చెప్పారని ఎద్దేవా చేశారు.
మరో వైపు బిజెపి నేతలు కూడా మీటర్ల పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బిజెపి పార్టీకి కేంద్ర ప్రభుత్వం మద్య ఏమైనా దూరం ఉందా అని ఈ సందర్భంగా రఘునందన్ రావును అడుగుతున్నానని సిఎం ప్రశ్నించారు. కనెక్షన్ల పై మీటర్లు పెట్టాలని వచ్చిన గెజిట్ కరెక్టా? లేదా నేతలు చెప్పేది తప్పా? చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టాలంటూ అందమైన ముసుగు తొడిగిన కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బిజెపి నేతలు సమర్ధిస్తున్నారా అని మాట్లాడారు. మీటర్లు పెట్టకపోతే తొక్కి చంపుతాం అన్ని ధోరణిలో మాట్లాడడం ఎంతవరకు సబబని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.