KCR New Party: ’కారు‘ దిగవద్దంటున్ననేతలు.. కేసీఆర్ జాతీయపార్టీ గుర్తు అదేనా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనున్న కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ పార్టీ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనున్న కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ పార్టీ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తాజాగా తమ సొంత మీడియా సంస్థలో ప్రముఖంగా తమ జాతీయ పార్టీ గురించి జాతీయ రాజకీయాల మీద తనకున్న ఆసక్తిని, తన ఆలోచనల్ని “పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం” పేరుతో ప్రజలకు తెలిసేలా చేశారు. అలాగే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మీడియా ముందుకు వచ్చి, త్వరలో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి రాబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దేశానికి ఆ అవసరం కూడా ఉందన్నారు.
అయితే కేసీఆర్ కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ పెట్టటం, దాన్నికొనసాగించటం అంత తేలికైన విషయం కాదు. కానీ, జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేయాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు పార్టీల్ని తన కొత్త పార్టీలో కలిపేయటం ద్వారా దానికో ప్రత్యేకతను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే, కొత్త పార్టీకి సంబంధించిన జెండా కచ్ఛితంగా పింక్ కలరే ఉంటుందని చెబుతున్నారు. అన్నింటికి మించి, కొత్త జాతీయ పార్టీ ఎన్నికల గుర్తుగా ఏది ఉండాలన్న దానిపై ‘కారే’ అని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కారును వదులుకోకూడదన్న భావన వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. తమకు కలిసివచ్చిన గులాబీ జెండాను ఎలాగూ తప్పక ఉంటుందని, పార్టీ గుర్తు విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ ఉందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇరత పార్టీల్లో వేటికైనా కారు గుర్తు ఉందా? అన్న ఎంక్వయిరీ ఇప్పటికే మొదలైనట్లుగా సమాచారం. ఒకవేళ ఏ పార్టీకి కారు గుర్తును కేటాయించకుండా ఉంటే, దాన్ని తాము తీసుకోగలుగుతామా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. ఈ విషయాన్ని చూడాల్సిందిగా కేసీఆర్ ఇప్పటికే కొందరికి ఆ భాధ్యత అప్పజెప్పారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. దీంతో వారు దానికి సంబంధించిన వివరాల్ని సేకరించే పనిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో తమకు విజయాల్ని తెచ్చి పెట్టిన కారు గుర్తును వదిలిపెట్టుకోకూడదన్న భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరి కేసీఆర్ కొత్త పార్టీ ఎప్పుడు అన్న ప్రశ్నకు సైతం టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజలకు అత్యంత పెద్ద పండుగ. ముఖ్యమైన పర్వదినంగా భావించే దసరా రోజునే తన కొత్త పార్టీ వివరాల్ని కేసీఆర్ ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి అయ్యిందని చెబుతున్నారు. పార్టీ అనౌన్స్ మెంట్ తోనే దేశ ప్రజల చూపు తమ పార్టీ మీద పడేలా ఆయన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగావేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రకటన తర్వాత దాదాపు రెండు నెలల పాటు కేసీఆర్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్త్రత స్థాయిలో పర్యటిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది