Last Updated:

RBI: రూ. 2వేల నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.

RBI: రూ. 2వేల నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు రూ. 2 వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే ఈ నోట్టు చట్టబద్దమైన టెండర్ గా కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

 

 

ఆర్బీఐ పలు సూచనలు(RBI)

దీంతో పాటు ఆర్బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసింది. రూ. 2 వేల నోట్లు కలిగి ఉన్నవాళ్లు ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 లోపల మార్చుకోవాలని సూచించింది. దేశంలో ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లు మార్చుకునే వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. 2016 నోట్ల రద్దు సందర్భంగా రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ చలామణిలోకి తీసుకువచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అదే విధంగా ఒక విడతలో రూ. 20 వేల చొప్పున మాత్రమే 2 వేల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలను ఆర్బీఐ విధించలేదు. బ్యాంకులకు సంబంధించి రోజు వారీ విధులకు ఆటంకాలు కలగకుండా నోట్ల మార్పిడి ప్రక్రియన చేపట్టాలని ఆర్బీఐ సూచించింది.

 

 

 

 

‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా: ఆర్బీఐ

రూ. 2 వేల డినామినేషన్ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017 కి ముందు జారీ చేసినవి ఆర్బీఐ తెలిపింది. వాటి జీవితకాలం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసినట్టు పేర్కొంది. మార్చి 31, 2018 నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6. 73 లక్షల కోట్ల నుంచి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ. 3. 62 లక్షల కోట్లకు తగ్గింది. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.