GHMC Council Meet: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో రచ్చ రచ్చ.. చరిత్రలో తొలిసారి అధికారుల బాయ్ కాట్
బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా.. వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.
GHMC Council Meet: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవ్వగానే బీజేపీ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మీ పోడియంను చుట్టు ముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎంత చెప్పినా వినకుండా పోడియం దగ్గరే నిరసనకు దిగారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బాయ్ కాట్ చేశారు. వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. విపక్ష సభ్యుల వ్యవహరిస్తున్న తీరుపై అసహంతోనే సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలో ఇలా అధికారలు సమావేశాన్ని బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జీహెచ్ఎంసీ చరిత్రలో(GHMC Council Meet)
జరిగిందేంటే.. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే విధంగా సమావేశానికి కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో వచ్చి నిరసనలకు దిగారు. నగరంలో వరుసగా కుక్కకాట్లు, దోమలు, వరదలు, ప్రజల ప్రాణాలను తీస్తున్న నాలాలపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొద్దిపాటి వర్షానికే నగరం మెుత్తం జలమయమవుతోందని ఆందోళన చేపట్టారు. ఎంత వారించినా వారు నిరసనలు ఆపకపోవడంతో విసుగెత్తిన అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు.
సమావేశం వాయిదా(GHMC Council Meet)
బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా.. వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్ చేయడం చర్చనీయాంశమైంది. అధికారులు బాయ్‌కాట్ చేయడంతో చేసేదేమి లేక కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్ విజయలక్ష్మి. చర్చ జరగకుండా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకోవడం బాధాకరమని మేయర్ అన్నారు.