Last Updated:

TSRTC Buses: రంగంలోకి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు…ఈ రోజు నుంచే ప్రారంభం

తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక రోజుల్లో.. పండుగల లాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది.

TSRTC Buses: రంగంలోకి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు…ఈ రోజు నుంచే ప్రారంభం

TSRTC Buses: తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ అవుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక రోజుల్లో.. పండుగల లాంటి సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది. తాజాగా టీఎస్ఆర్టీసీ తొలిసారి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను జోడించి రంగంలోకి దింపింది. ప్రైవేటు స్లీపర్ బస్సులకు ఏమాత్రం తీసిపోని విధంగా దాదాపు అన్ని రకాల వసతులతో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించింది. ఈ బస్సులు సోమవారం ఎల్బీనగర్ లో ప్రారంభం అయ్యాయి. ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సులు మాదిరిగానే వీటికి ‘లహరి అమ్మఒడి అనుభూతి’గా టీఎస్ ఆర్టీసీ పేరు పెట్టింది. ఈరోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, హుబ్లీ రూట్లో ఈ బస్సులు నడవనున్నాయి.

 

ఏసీ స్లీపర్ లో సదుపాయాలు

ప్రయాణికుల భద్రత కోసం బస్సు ట్రాకింగ్‌ సిస్టంతో పాటు బస్సులో ‘పానిక్‌ బటన్‌’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది.

బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్‌ డిటెక్షన్‌- అలారం సిస్టం (ఎఫ్‌డీఏఎస్‌) ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే ఫైర్‌ డిటెక్షన్‌ అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఉంటుంది.

12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15 కలిపి 30 చొప్పున బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌కు మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సౌకర్యం, రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటాయి.

 

డైనమిక్ ప్రైసింగ్ విధానంతో..

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం తీసుకువచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో… అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 27వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేయనుంది. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది.

అలాగే సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఈ విధానంలో ఎక్కువ ధర ఉంటుంది. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతలు.. ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.