Medico Preethi Case: డాక్టర్ ప్రీతిపై సైఫ్ కోపానికి కారణాలివే..
ఓ యాక్సిడెంట్ కేసులో సైఫ్ గైడెన్స్ లో ప్రీతి పనిచేసినట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా, దానిని పలు వాట్సాప్ గ్రూప్ ల్లో పెట్టి
Medico Preethi Case: తెలంగాణలో సంచలన సృష్టించి వరంగల్ మెడికల్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఘటనతో నిందితుడైన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్పాప్ చాట్స్ పోలీసులు గుర్తించారు.
అనుషా, భార్గవి, ఎల్డీడీ+నాక్ అవుట్స్ గ్రూప్ చాట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతికి.. సైఫ్ సూపర్ వైజర్ గా ఉండేవాడని, అయితే రెండు సందర్బాల్లో సైఫ్ .. ప్రీతిపై కోపం తెచ్చుకున్నట్టు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది.
ప్రీతిని హేళన చేసి..(Medico Preethi Case)
డిసెంబర్ లో ఓ యాక్సిడెంట్ కేసులో సైఫ్ గైడెన్స్ లో ప్రీతి పనిచేసినట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా, దానిని పలు వాట్సాప్ గ్రూప్ ల్లో పెట్టి ఎగతాళి చేశాడు.
రిజర్వేషన్ లో ప్రీతికి మెడికల్ సీట్ వచ్చిందంటూ ఆమెను అవమానపరిచాడు. దానికి స్పందించిన ప్రీతి.. దాని వల్ల ఏమైనా ఇబ్బందా? అంటూ సైఫ్‌ను ప్రశ్నించింది.
ఏమైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలంటూ సైఫ్ ను వార్నింగ్ ఇచ్చింది.
దీంతో ప్రతీపై పగ పెంచుకున్న సైఫ్ తన స్నేహితుడు భార్గవ్‌కు ప్రీతిని వేధించాలని చెప్పాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఇక ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ ఉసిగొల్పాడని గుర్తించారు.
ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన ప్రీతి గత నెల 21న హెచ్‌వోడీ నాగార్జునకి సైఫ్ పై ఫిర్యాదు చేసింది.
డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌కు వైద్యులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
విచారణ ఖైదీగా సైఫ్
కాగా, సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
5 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. మరోవైపు నిందితుడు మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అతడిని ఈ నెల 24 న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించారు.
నిందితుడు సైఫ్ ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు అతనిని ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు.
నేరం కాని రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు.
యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం
వరంగల్ మెడికో ప్రీతి ఘటనకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం యాంటీ ర్యాగింగ్ కమిటీ సుదీర్ఘ సమావేశం కొనసాగుతోంది.
ఈ కమిటీ ముందు అనస్తీషియా హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ప్రీతి ఘటనలో నాగార్జున రెడ్డి నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీ వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది