Air India Hiring: ఎయిర్ ఇండియాలో భారీగా నియామకాలు
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
Air India Hiring: ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది వరకే 470 విమానాల కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకుంది ఎయిర్ ఇండియా. తాజాగా ఎయిర్ ఇండియా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులను భారీ సంఖ్యలో నియమించుకునేందుకు సిద్ధమైంది. కేబిన్ సిబ్బంది, పైలట్లు కలుపుకొని మొత్తం 5,100 మందిని ఈ ఏడాదిలో నియమించుకోబోతున్నట్లు తెలిపింది. కొత్త విమానాలు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకే ఎయిర్ ఇండియా నుంచి ఈ ప్రకటన వచ్చింది.
భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకం(Air India Hiring)
దేశీయ సేవలతో పాటు అంతర్జాతీయంగా ఎయిర్ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించినట్లు ఎయిరిండియా తెలిపింది.
ఇందులో భాగంగా 4,200 మంది ట్రైనీ కేబిన్ సిబ్బందితో పాటు 900 మంది పైలట్లను నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు పేర్కొంది.
కేబినెట్ సిబ్బందికి 15 వారాల శిక్షణ ఉంటుందని ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ వెల్లడించింది. శిక్షణ జరుగుతున్న సపయంలో భద్రత, సేవలు, దేశ ఆతిథ్యం, టాటా గ్రూప్ సంస్కృతిపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
113 విమానాలు.. 1600 మంది పైలట్లు
గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం 1900 మంది కేబిన్ సిబ్బందిని నియమించుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. జులై నుంచి జనవరి మధ్య 7 నెలల్లో 1100 మందికి శిక్షణ ఇచ్చామంది. అందులో 500 మందిని సేవలకు వినియోగించుకుంటున్నట్టు పేర్కొంది.
ప్రస్తుతం ఎయిరిండియా 113 విమానాలు నడుపుతుండగా.. అందులో మొత్తం 1600 మంది పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇటీవలే 36 విమానాలను లీజుకు తీసుకునేందుకు కూడా ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. అందులో 2 విమానాలు ఇప్పటికే సర్వీసులు అందిస్తున్నాయి.