Taraka Ratna Funeral: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు.. పాడే మోసిన బాలకృష్ణ
నందమూరి తారక రత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా తారక రత్న అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి.
Taraka Ratna Funeral: నందమూరి తారక రత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా తారక రత్న అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు.
తారకరత్న పాడెను చిన్నాన్నలు రామకృష్ణ, బాలకృష్ణ, ఇతర బంధువులు మోసారు. భారమైన హృదయాలతో తారకరత్నను చంద్రబాబు, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, కుటుంబసభ్యులు, అభిమానులు సాగనంపారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు(Taraka Ratna Funeral)
అంతకుముందు ఫిల్మ్‌ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానం వరకు కొనసాగింది. ఆయనను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ తరలివచ్చారు. వివాదాలకు దూరంగా ఉండే తారకరత్న అంటే అందరికీ అభిమానమే.
అందుకే తారకరత్నను కడసారి చూసేందుకు భారీగా వచ్చారు. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి అంతిమయాత్రలో పాల్గొన్నారు. తారకరత్నను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ తానై బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు.
కన్నీటి సంద్రమైన మోకిల
మృత్యువుతో 23 రోజులుగా పోరాడిన నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని బెంగళూర్ నుంచి రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని తన నివాసానికి ఆదివారం ఉదయం తీసుకువచ్చారు.
తారకరత్నను కడసారి చూసేందుకు బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్థానికులు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దాంతో ఆయన నివాసం జన సంద్రమైంది. చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రహ్మణీతో కలసి వచ్చి తారకరత్నకు నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.