Rishabh Pant: రిషబ్ పంత్ హెల్త్ బులిటెన్.. వైద్యులు ఏం అంటున్నారంటే..?
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడం క్రికెట్ అభిమానులందరినీ కలిచివేసింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పంత్ కు తృటిలో ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు
Rishabh Pant: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడం క్రికెట్ అభిమానులందరినీ కలిచివేసింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పంత్ కు తృటిలో ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు. కానీ రోడ్డు ప్రమాదం కారణంగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలంటూ టీమిండియా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు, అతని సన్నిహితులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నారు ఆసుపత్రి వర్గాలు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతను వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పంత్ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయని.. చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు.
ఇకపోతే ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఉమేష్‌కుమార్ కూడా ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్య పరిస్థితిన సమీక్షిస్తున్నారు. ‘ప్రస్తుతం పంత్‌ను వేరే ఆసుపత్రికి తరలించే ఆలోచన లేదని.. అతని ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆయన తెలిపారు. పంత్ నుదుటికి చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేశారని.. మొదటి డ్రెస్సింగ్ కూడా చేశారని ఆయన స్పష్టం చేశారు. రిషబ్ చికిత్సలో మంచి పురోగతి కనిపిస్తోందని అందుకే అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలా వద్దా అని వైద్యులు ఇంకా నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు.
పంత్ త్వరగా కోలుకుంటాడన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కాగా పంత్ సోదరి సాక్షి పంత్ తన సోదరుడితో జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలిసి లండన్ నుంచి వెంటనే డెహ్రాడూన్ చేరుకున్నారు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ కూడా పంత్‌ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.