Guntur Incident : గుంటూరు ఘటన ఎఫెక్ట్ … ఇకపై చంద్రబాబు సభలకు నో పర్మిషన్ అంటున్న వైసీపీ నేతలు
Guntur Incident : గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే ప్రజలు భారీగా రావడంతో తోపులాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై చంద్రబాబు, సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని సీఎం జగన్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అటు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని గుంటూరు జీజీహెచ్ లో బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో ఘటన జరగడం పట్ల వైకాపా నేతలు చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.