Tirumala: శ్రీవారి భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
Tirumala: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా ఈ టోకెన్లు జారీ చేస్తారు.తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్‌పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో ఈ టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఈవో సింఘాల్ విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు.తిరుమల శ్రీవారి భక్తులకు జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.