కైకాల సత్యనారాయణ: యముడికి కేరాఫ్ అడ్రస్ గా కైకాల సత్యనారాయణ
తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే.
Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. 60 ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలతో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించి మెప్పించారాయన. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకటిమేమిటి ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు కైకాల.
ఇకపోతే కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమగోల సినిమాలో యముడి పాత్రలో ఒదిగిపోయి ఎన్టీఆర్ కి పోటీగా నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చారు కైకాల. ఆ సినిమాలో ధర్మ పరిరక్షణా ధురంధరుండా.. యముండా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నిజంగా యముడంటే ఇలాగే ఉంటాడేమో అని కాసేపు చూసే వీక్షకులంతా మైమరిచిపోయారు. అంతగా పాత్రలో లీనమైపోయి అందర్నీ నమ్మించారు. గంభీరంగా కనిపిస్తూనే, కంచులాంటి స్వరంతో ఓ పక్క భయం పుట్టిస్తూనే మరోపక్క అద్భుతమైన నటనని ప్రదర్శించారు కైకాల సత్యనారయణ.
ఇక ఆ సినిమా తర్వాత యముడి పాత్ర వేయాలంటే కైకాల సత్యనారాయణే వేయాలి అని అందరూ అనుకునేవారు. అంతా ఆ పాత్ర కైకాలకు గుర్తింపును తెచ్చిపెట్టింది. తర్వాత యమలీల, యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, దరువు సినిమాల్లో కూడా సత్యనారాయణ యముడి పాత్రని వేసి తనదైన శైలిలో ప్రజలను మెప్పించారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్ని యముడి పాత్రలు వచ్చినా వాటన్నిటికి యమగోల సినిమాలో కైకాల వేసిన యముడి పాత్రే ఆదర్శం. ఇలా మొత్తంగా చెప్పాలంటే తెలుగు పరిశ్రమలో యముడి పాత్రకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు కైకాల.
ఇదీ చదవండి: కేజీఎఫ్ హీరో యశ్ ఫ్యూచర్ ఏంటో నాలుగేళ్ల కిందటే చెప్పిన కైకాల సత్యనారాయణ.. ఏమన్నారంటే?