కైకాల సొంతూరు కౌతవరం: 30 ఏళ్ల కిందటే హాస్పిటల్ కట్టి దానం చేసిన సత్యనారాయణ
నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Kaikala Satyanarayana: నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సొంతూరు కౌతవరమన్న, నాటక రంగ కళాకారుడిగా తనను తీర్చిదిద్దిన గుడివాడన్న కైకాల సత్యనారాయణకు ఎంతో అభిమానమని ఆయన బధువులు తెలిపారు. కళాకారుడిగా తీరిక లేని రోజుల్లో కూడా తాను ఎప్పుడూ తన స్వగ్రామాన్ని మరువలేదని.. తరచూ కౌతవరం వచ్చి, తన మిత్రులను కలుసుకునేవారని వారి బాగోగులు అడిగి తెలుసుకునే వారని చెప్తూ.. ఆనాటి రోజులను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కైకాల బాల్యం ఎక్కువగా ఊరి చెరువు చుట్టూనే పెనవేసుకొని ఉండడంతో, ఆ చెరువు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఉండేదని, కౌతవరం నుండి ఎవరు వచ్చిన సరే చెరువు బాగోగులు అడిగి తెలుసుకునే వారని గ్రామస్తులు తెలిపారు. కౌతారం గ్రామ చెరువులో పెరిగిన చాపలు అంటే అమితమైన ఇష్టంగా తినేవారిని ఆయనకు ముఖ్యంగా చేప తల అంటే ఇష్టమని కైకాల స్నేహితులు ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆయన చదువులోనే కాకుండా అల్లరిలోనూ నెంబర్ వన్ అని చిలిపి పనులు చేస్తూ అందరితో సందడిగా ఉండేవాడని.. స్వశక్తితో కష్టపడి ఇంతటి స్థాయికి చేరుకున్నారని ఆయన తనతో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడని కైకాల మేనల్లుడు చెప్పుకొచ్చారు.
తన స్వగ్రామ అభివృద్ధికి కైకాల ఎంతో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. తన పరిచయాలతో ప్రభుత్వ నిధులు తీసుకురావడమే కాక, లక్షలాది రూపాయల సొంత నిధులతో కౌతవరం రూపురేఖలు మార్చారని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఊరికి వచ్చేలా చేశారని.. 30 ఏళ్ల క్రితమే గ్రామంలో అధునాత సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి హ్యాండోవర్ చేశారని ఆయన మేనల్లుడు రాంబాబు తెలిపారు.
ఆయనను ఇటీవల కాలంలో వెళ్లి చూసినప్పుడు కాస్త అనారోగ్యంతో ఉన్నారని త్వరగా కోలుకుని గ్రామంలోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తారని అనుకునేలోపు ఇలా జరగడం తమను తీవ్ర దిగ్బ్రాంతిలోకి నెట్టేసిందని రాంబాబు తెలిపారు. కైకాల మరణాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కైకాల ఆరోగ్యం కుదుటపడి అంత బాగుందనుకున్న సమయంలో ఇలా జగడం తమను కలచివేసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మరణ సమాచారం అందుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్లోని కైకాల ఇంటికి తరలివెళ్లారు. గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని.. లేదంటే తామంతా కలిసి గ్రామస్తుల సహకారంతో కైకాల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్నేహితులు, బంధువులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చిరంజీవి, కైకాల సత్యనారాయణది “ఉప్ప చేప పప్పుచారు బంధం” అని ఎందుకు అంటారు..?