జూనియర్ ఎన్టీఆర్ : చంద్రబాబు ఖమ్మం సభలో తారక్ మానియా… సీఎం సీఎం అంటూ
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్‌కు ఏపీ రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. గతంలో తెదేపా తరుపున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. చంద్రబాబు నాయుడుకి వయస్సు అయిపోయిందని… లోకేష్ కు పార్టీని నడిపించేంత సత్తా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. వాటిపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఆయన స్పందించినా కూడా … పలువురు నేతలు ఎన్టీఆర్ పై భిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఏదో ఒక సంఘటన జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగుతోంది. తాజాగా చంద్రబాబు ఖమ్మం పర్యటన లోనూ… ఎన్టీఆర్ పేరు మారుమోగడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో గల సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని టీటీడీపీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు హరికృష్ణ కూతురు సుహాసిని కూడా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత తాను ఖమ్మం వచ్చాననీ. ఈ సభకు మీరంతా వచ్చారనీ. అందులోనూ మీలో యువత ఎక్కువగా ఉన్నారని… సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాను అధికారం కోరుకోలేదనీ. మీ అభిమానం మాత్రమే కోరుకున్నాననీ అన్నారు చంద్రబాబు.
తెలంగాణకు టీడీపీ ఏం చేసిందో గుర్తు తెచ్చుకోవాలనీ. తెలుగుదేశం ఆవర్భవించిందే ఈ తెలంగాణ గడ్డపైనని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు, జెండాలతో కార్యకర్తలు హాల్ చల్ చేశారు. ముఖ్యంగా సీఎం ఎన్టీఆర్… సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో ట్రెండింగ్ గా మారింది. ఈ తరుణంలోనే తెదేపా పగ్గాలను తారక్ చేపడతారా అనే అంశం తెరపైకి వచ్చింది.
మరోవైపు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారు. రాజకీయంగా ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే… అది లోకేశ్‌కు మైనస్ అవుతుందని… అందుకే ఆయన్ను రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. వైకాపా నేత కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇదే విషయాన్ని చాలా సార్లు మీడియా కూడా వెల్లడించారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. అభిమానులు భారీ ర్యాలీగా తరలి వచ్చి ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పదేపదే రిపీట్ అవుతుండడం పట్ల ఎన్టీఆర్ పేరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.