జనసేన : జాతీయ రైతు దినోత్సవం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్లాన్…
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారని చెప్పాలి. అధికార పార్టీ నాయకుల వైఫ్యల్యాన్ని ఎండగడుతూ… ప్రజలకు మరింత చేరువవుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడం ఖాయం అని బలంగా చెబుతున్నారు. ఈ మేరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ… క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూనే పవన్ గేర్ మార్చినట్లు స్పష్టంగా కనబడుతుంది. మంగళగిరి వద్ద నున్న ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ సమస్య, వైజాగ్ పర్యటన, వారాహి వంటి ఘటనలలో వైకాపా, జనసేన మధ్య మాటల యుద్దానికి దిగిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ నెల 23న ‘జాతీయ రైతు దినోత్సవం’ వేడుకలు ఇలా చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పవన్ పిలునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని జనసేన పార్టీ విడుదల చేసింది.
ఆ ప్రెస్ మీట్లో “జాతీయ రైతు దినోత్సవం” పురస్కరించుకుని డిసెంబర్ 23న జనసైనికులు, వీరమహిళలు రైతులతో మమేకమయ్యేందుకు గ్రామాల్లోని వ్యవసాయ భూములను సందర్శిద్దాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి రైతులతో చర్చించి తెలుసుకుందాం. జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సమిష్టిగా ఏర్పడి స్థానిక రైతులతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం పరితపిస్తున్న విధానాన్ని వివరిద్దాం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానాలను గురించి అందరికీ తెలియజేసి, రైతు సంక్షేమం కోసం జనసేన పని చేస్తుందనే భరోసా రైతులకు కల్పిద్దాం.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘కౌలురైతు భరోసా యాత్ర’లో 3 వేలకు పైగా కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్న దాని గురించి అందరికీ తెలియజేసే విధంగా ప్రచారం చేద్దాం. రైతులు, రైతు కుటుంబాల కోసం పరితపిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలకు మద్దతుగా రైతు పొలాల్లో రైతు అనుమతితో జనసేన జెండాలను ప్రదర్శిద్దాం అని రాసుకొచ్చారు.
ఈ నెల 23న ‘జాతీయ రైతు దినోత్సవం’ వేడుకలు ఇలా చేద్దాం – JanaSena Party PAC Member Shri @NagaBabuOffl pic.twitter.com/JOH8XQLjoA
— JanaSena Party (@JanaSenaParty) December 21, 2022