క్రికెట్: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం.. బంగ్లాదేశ్ జట్టుకు చిత్తుచేసిన భారత క్రికెటర్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
Cricket IND VS BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 272/6 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, 324 పరుగులకి ఆలౌట్ అయింది బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 108 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి పోరాటం చేసినా అక్షర్ పటేల్ (4,)కుల్దీప్ యాదవ్ (3 ) ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. దీనితో భారత జట్టు 188 పరుగుల తేడాతో మొదటి టెస్ట్ ను గెలుచుకుంది.
513 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 156 బంతుల్లో 7 ఫోర్లతో 67 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత యాసిర్ ఆలీ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత లిటన్ దాస్, జాకీర్ హసన్ కలిసి మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన లిటన్ దాస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మరోవైపు జాకీర్ హసన్ 224 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేశాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మొట్టమొదటి బంగ్లా ఓపెనర్‌గా నిలిచిన జాకీర్ హసన్, సరిగ్గా 100 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాత ముస్తాఫికర్ రహీం, నురుల్ హసన్ ఇద్దరూ అక్షర్ పటేల్ బౌలింగ్ లోనే అవుటయ్యారు. దీనితో 324 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్సింగ్స్ ముగిసింది. 8 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.