హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసు.. దమ్మాయిగూడ చెరువులో దొరికిన చిన్నారి మృతదేహం
హైదరాబాద్ జవహర్ నగర్ లోని బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. గురువారం నాడు కనిపించకుండా పోయిన చిన్నారి, శుక్రవారం నాడు దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది.
Hyderabad: హైదరాబాద్ జవహర్ నగర్ లోని బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. గురువారం నాడు కనిపించకుండా పోయిన చిన్నారి, శుక్రవారం నాడు దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది. చెరువులో చిన్నారి డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పాప మృతదేగాన్ని తమకు చూపించకుండానే తరలించారంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మరియు స్థానికులు ఆందోళనకు దిగారు. చిన్నారిపై అఘాయిత్యం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించడం లేదంటూ గురువారమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.
స్కూలు నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని గురువారం నుంచి కనిపించకుండా పోయింది. ఎప్పట్లానే గురువారం నాడు ఉదయం కూడా దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో పాపను దించి వెళ్లానని ఆ చిన్నారి తండ్రి చెప్పారు. అయితే మధ్యాహ్నం సమయానికి పాప స్కూలులో లేదంటూ పాఠశాల నుంచి ఫోన్ వచ్చిందని ఆయన తెలిపారు.
పాప బుక్స్, బ్యాగ్ క్లాసులోనే ఉన్నాయి కానీ పాప లేదని టీచర్ చెప్పారన్నారు. దానితో వెంటనే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని పాప తండ్రి చెప్పారు.
పాప ఆచూకీ చూపిన సీసీ ఫుటేజీ
పాప తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించినట్లు వెల్లడించారు.
స్కూల్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. ఆ చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం కనిపించిందని పేర్కొన్నారు.
సీసీ ఫుటేజీ సాయంతో కనిపించకుండా పోయిన పాప దమ్మాయిగూడ చెరువు వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. దానితో శుక్రవారం నాడు దమ్మాయిగూడ పరిసరాల్లో మరియు చెరువులో వెతకగా.. చిన్నారి మృతదేహం చెరువులో లభ్యమయ్యిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. అయితే, డెడ్ బాడీని తమకు చూపించకపోవడంపై పాప తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాప కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని ఆరోపించారు. తమ పాప మిస్సింగ్ కేసులో అనుమానాలున్నాయని పోలీసులు తమకు న్యాయం చెయ్యాలని వారు కోరుతున్నారు.
చిన్నారి తెలియక కాలుజారి నీటిలో పడి చనిపోయిందా లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఆ పాపను నీటిలో పడేశారా లేదా ఇంకేమా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో తోటికోడళ్ల హత్య… హంతకులను పట్టించిన చెప్పు… ఎలాగంటే…