Komatireddy Venkatareddy : ఎన్నికలముందు ఏ పార్టీలో చేరాలో డిసైడవుతాను.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.
Telangana Politics: తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గురువారం తిరుమలలో దైవదర్శనం చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. షర్మిల ఘటన దురదృష్టకరమని.. అందరూ దీనిని ఖండించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి పోటీచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి పలు రకాల కామెంట్లు చేశారు. ఈ కారణంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. అవి తన మాటలు కాదని.. తన మాటల్ని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ వివరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొనలేదు.